లాటరీ పేరుతో కుచ్చుటోపీ

24 Jul, 2016 23:00 IST|Sakshi
లాటరీ పేరుతో కుచ్చుటోపీ
తణుకు : ‘కోకాకోలా డ్రాలో మీ మొబైల్‌ నెంబర్‌కు లాటరీ తగిలింది.. 50 వేలు పౌండ్లు గెలుచుకున్నారు. తక్షణమే మీ వివరాలను ఫలానా మెయిల్‌ ఐడీకు పంపించండి’ అంటూ ఇటీవలి కాలంలో పలువురు సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి.
వీటికి  స్పందించి వివరాలు పంపితే మాత్రం పన్నులు కట్టాలని, ఖర్చులకని రూ.లక్షల్లో ఎరవేసి దోచుకుంటూ కుచ్చుటోపీ పెడుతున్న సంఘటనలు నమోదవుతున్నాయి. తాజాగా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన దార్ల వెంకటసూర్యనారాయణ ఇదే తరహా మోసానికి గురై సుమారు రూ.1.40 లక్షలు చెల్లించి చేతులు కాల్చుకున్నారు. అయితే లాటరీ ముసుగులో ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్న సంజయ్‌కుమార్‌పై సీబీసీఐడీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా సూర్యనారాయణ తాను కూడా మోసపోయానని గ్రహించి లబోదిబోమంటున్నాడు.
మోసం ఇలా.. నోకియా సంస్థ నిర్వహించిన లాటరీలో రూ.6 కోట్ల మేర లాటరీ తగిలిందని చెబుతూ సుమారు నాలుగేళ్ల క్రితం సూర్యనారాయణకు సెల్‌ఫోన్‌లో మెసేజ్‌ వచ్చింది. దీనికి స్పందించిన సూర్యనారాయణ తన వివరాలను పంపించాడు. ఇతన్ని నమ్మించేలా రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా నుంచి మెసేజ్‌ చేస్తున్నట్లుగా లాటరీ మొత్తం చెల్లించడానికి ముందుగా ఖర్చులు, పన్నులు చెల్లించాలని రూ.20 వేలు చొప్పున రెండు పర్యాయాలు చెల్లించాలని కోరడంతో సూర్యనారాయణ అలాగే పంపించాడు. తిరిగి గతేడాది రూ. 98 వేలు చెల్లించాలని మరో మెయిల్‌ రావడంతో తణుకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాడు. అప్పటి నుంచి ఎలాంటి సమాధానం రాకపోగా.. ఇటీవల సీబీసీఐడీ అధికారులు సూర్యానారాయణ బ్యాంకు ఖాతా లావాదేవీలపై ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గతేడాది డిసెంబరులో రూ.15 లక్షలు సూర్యనారాయణ ఖాతాలో జమ కాగా.. వారం రోజుల అనంతరం తిరిగి వేరే ఖాతాలోకి మళ్లించినట్లు లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయి. 
అధికారుల ఆరా.. జోద్‌పూర్‌కు చెందిన సంజయ్‌కుమార్‌ పలువురి నుంచి ఇదే తరహాలో లాటరీ పేరుతో రూ.కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతోనే అధికారులు ఇతని కదలికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీసాయి ఎంటర్‌ప్రైజెస్, జోద్‌పూర్‌ బ్రాంచి నుంచి సూర్యనారాయణ ఖాతాకు రూ.15 లక్షలు జమ కావడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఇందులో భాగంగానే సూర్యనారాయణ లావాదేవీలను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు గత వారంలో రాజమండ్రి సీబీసీఐడీ కార్యాలయానికి పిలిపించి విచారించినట్లు తెలుస్తోంది. సూర్యనారాయణ ఖాతాలో జమ అయిన రూ.15 లక్షలను అతనికి తెలియకుండా మరో ఖాతాకు ఎవరు మళ్లించారు అనేది అంతు చిక్కడంలేదు. 
డబ్బులు ఇప్పించాలి.. ఆన్‌లైన్‌లో లాటరీ తగిలిందని ఇందుకు పన్నులు, ఖర్చుల రూపంలో డబ్బులు పంపించమని కోరడంతో రూ.1.40 లక్షలు చెల్లించా. అయితే ఇప్పుడు ఇదంతా మోసమని తెలుస్తోంది. దీనిపై విచారణ చేసి తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని అధికారులను అభ్యర్థించాను. – దార్ల వెంకటసూర్యనారాయణ, బాధితుడు, దువ
 
 
 
 
>
మరిన్ని వార్తలు