ప్రేమజంట అస్తిపంజరాలు లభ్యం

18 Jul, 2016 06:30 IST|Sakshi
ప్రేమజంట అస్తిపంజరాలు లభ్యం
  • సుమారు 80 రోజులకు అస్తిపంజరాలు లభ్యం
  • పులుకుర్తి సమీపంలో వెలుగులోకి..
  •  ఆత్మకూరు/శాయంపేట : 
     
    ఇద్దరూ ప్రేమించుకున్నారు...పెళ్లి చేసుకుందామనుకున్నారు.. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి తనువు చాలించారు. శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన ఈ జంట ఆత్మకూరు మండలం పులుకుర్తి–ల్యాదల్ల గ్రామాల మధ్య గల గుట్టల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, సుమారు 80 రోజుల తర్వాత ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..  కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన రామగిరి ప్రభాకర్‌–వనమ్మల ఏకైక కుమారుడు రంజిత్‌(28) ఎంబీఏ పూర్తిచేసి ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన గుర్రం దేవేందర్‌–శారదల పెద్ద కుమార్తె సహన(20) గుడెప్పాడ్‌ విట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌(సివిల్‌) మొదటి సంవత్సరం పూర్తిచేసింది. వీరిరువురూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో గతంలో ఒకసారి తల్లిదండ్రులు గొడవ చేయడంతో రంజిత్‌ ఆత్మకూర్‌ మండలం ఊరుగొండ సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

    నాటి నుంచి రెండు నెలల పాటు రంజిత్‌ను తండ్రి ప్రభాకర్‌ బంధవుల ఇంటి వద్ద ఉంచారు. తిరిగి ఊళ్లోకి వచ్చాక వారి ప్రేమ యథావిధిగా కొనసాగింది. అయితే రంజిత్‌కు ఇటీవల పెళ్లి సంబంధం రావడంతో తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరని భావించి ఏప్రిల్‌ 26న ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు తన కూతురు కనిపించడం లేదని, రంజిత్‌ కిడ్నాప్‌ చేశాడని సహన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసులు వెదుకుతున్నారు. అదే నెల 30న ఆత్మకూర్‌ మండలం పులుకుర్తి గుట్టల్లో రంజిత్‌ తీసుసుకెళ్లిన ద్విచక్ర వాహనం కనిపించడంతో గుట్ట ప్రాంగణమంతా తనఖీ చేశారు. అయినా వారు ఎక్కడా కనిపించకపోవడంతో తప్పుదోవ పట్టించేందుకే బైక్‌ ఇక్కడ వదిలివెళ్లి ఉంటారని భావించి వెనుదిరిగారు. అప్పటి నుంచి కాల్‌ రికార్డ్‌ సేకరించినా ఎలాంటి సమాచారం అందలేదు.
     
    గుట్టల్లో అస్తి పంజరాలు..
    ఆదివారం ఉదయం ఓ గొర్రెల కాపరికి పులుకుర్తి గుట్టల్లో అస్తిపంజరాలు కనిపించడంతో స్థానిక సర్పంచ్‌ వెంకన్న ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలతో మృతిచెందింది రంజిత్, సహనలుగా గుర్తించారు. అక్కడ పురుగుమందు డబ్బా పడి ఉండడంతో అది తాగి ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. ఈ విషయాన్ని మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సీఐ రవికుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
మరిన్ని వార్తలు