మైదానంలో ‘ప్రేమ’ వెలుగు!

13 Feb, 2017 22:33 IST|Sakshi
మైదానంలో ‘ప్రేమ’ వెలుగు!
- టి20 అంధుల ప్రపంచ విజేతల్లో నంద్యాల క్రీడాకారుడు
- అంధుల ప్రపంచ కప్‌లో ప్రేమ్‌కుమార్‌ అద్భుత ప్రతిభ
 
నంద్యాలవిద్య:  అంధులైనా.. ఆత్మవిశ్వాసంతో టి 20 ప్రపంచ కప్‌లో విజేతలుగా నిలిచారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యర్థి పాకిస్తాన్‌ జట్టుపై విజయం సాధించి డిఫెండింగ్‌ చాంపియన్‌గా నిలిచారు. అంధుల పోటీలో ఇండియా తరఫున ఆడిన జట్టులో నంద్యాల సెయింట్‌ లూక్స్‌ అంధుల పాఠశాల పూర్వ విద్యార్థి గుండాల ప్రేమ్‌కుమార్‌ బౌలర్‌గా, బ్యాట్స్‌ మెన్‌గా రాణించి సత్తా చూపాడు. డోన్‌ మండలం సీసంగుంతల గ్రామం గుండాల ఎల్లయ్య, సుంకులమ్మ కుమారుడు ఇతను. పుట్టుకతో అంధుడు. ప్రాథమిక విద్యను సీసంగుంతలలో అభ్యసించాడు. నంద్యాల ఎస్పీజీ పాఠశాలలో ఉన్నత విద్యను చదివాడు. సెయింట్‌ లూక్స్‌ అంధుల పాఠశాలలో ఉంటూ కళాశాలలకు విద్యను పూర్తిచేశాడు. 
 
క్రీడలపై ఆసక్తి..
చిన్నప్పటి నుంచి ప్రేమ్‌కుమార్‌కు క్రీడలపై ఆసక్తి ఉంది. క్రికెట్‌లో సచిన్‌ ఆటతీరును ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్నాడు. క్రికెట్‌లో నైపుణ్యం సంపాదించేందుకు నిరంతరంగా శ్రమించాడు. ఈ క్రమంలో పట్టణ స్థాయి క్రికెట్‌ పోటీలో ప్రతిభ చూపాడు. తదనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రావీణ్యం కనబరిచాడు. ఆసియాకప్‌ క్రికెట్‌ పోటీల్లో 2016లో బౌలర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డును గెలుచుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌ పోటీల్లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాపై 1/14తో పొదుపుగా బౌలింగ్‌ చేసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈనెల 11న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన అంధుల టి20 క్రికెట్‌ పోటీల్లో బౌలర్‌గా రాణించడం, జట్టు విజయానికి దోహదపడింది.
 
ఉపాధ్యాయుల హర్షం..
సెయింట్‌ లూక్స్‌ అంధుల పాఠశాల విద్యార్థి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం, విజేతగా నిలువడం స్థానిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల సూపర్‌వైజర్‌ చర్చిల్‌ మాట్లాడుతూ ప్రేమ్‌కుమార్‌ ప్రతిభ కలిగిన విద్యార్థి అని, క్రీడల్లో చురుగ్గా పాల్గొనేవాడన్నారు. జాతీయ జట్టులో పాల్గొనడం, అంతర్జాతీయ ప్రతిభ కనబరచడం తమకు గర్వంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్‌ను ఫోన్లో సంప్రదించగా సెయింట్‌లూక్స్‌ అంధుల పాఠశాల తల్లిలాంటిదని, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం పునర్జన్మ అన్నారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
 
మరిన్ని వార్తలు