కిరాణ షాపులకు తక్కువ ధరకే సరుకులు

3 Nov, 2016 00:21 IST|Sakshi
–రూరల్‌ రిటైల్‌ చైన్‌తో ప్రయోజనం
–డీపీఎం వసంత
 
కర్నూలు(హాస్పిటల్‌): గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న కిరాణాషాపుల్లో విక్రయించేందుకు అవసరమైన సరుకులను తక్కువ ధరకే రూరల్‌ రిటైల్‌ చైన్‌ ద్వారా అందజేయనున్నట్లు డీఆర్‌డీఏ–వెలుగు డీపీఎం వసంత చెప్పారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రూరల్‌ రిటైల్‌ చైన్‌ కింద జిల్లాలో జూపాడుబంగ్లా, కొత్తపల్లి, బేతంచెర్ల, పెద్దకడుబూరు, దేవనకొండ మండలాలను ఎంపిక చేశారన్నారు. ఈ మండలాల్లో చిన్న చిన్న కిరాణాషాపులను గుర్తించి 50 మందికి పైగా సభ్యులతో మండల నోడల్‌ స్టోర్‌గా ఏర్పాటు చేసి మేనేజర్‌ను నియమిస్తారన్నారు. ఆ మేనేజర్‌ ద్వారా ఎంపికైన వారిచే రూ.5000ల చొప్పున వాటాధనం కట్టిస్తారన్నారు. అనంతరం జిల్లా కో ఆపరేటివ్‌ కార్యాలయంలో ఎంపికైన బాడీని రిజిస్టర్‌ చేయిస్తారని తెలిపారు. ఈ సంఘానికి వ్యాట్, పాన్‌కార్డు తీసుకున్న అనంతరం ప్రభుత్వం రూ.10లక్షలు మూలధనం ఇస్తుందన్నారు. వాటాధనం, ప్రభుత్వ మూలధనం కలిపి సరుకులను ఉత్పత్తి చేసే కంపెనీల నుంచే టోకుగా సరుకులు కొనుగోలు చేస్తారన్నారు. సంఘంలో సభ్యులైన కిరాణాషాపుల వారు మండల నోడల్‌ స్టోర్‌ నుంచి తక్కువ ధరకు సరుకులను కొనుగోలు చేసి విక్రయించవచ్చన్నారు. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ విధానం జూపాడుబంగ్లాలో అమలు చేస్తున్నామని, మిగిలిన మండలాల్లో సభ్యులను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. 
 
మరిన్ని వార్తలు