పొన్నాడ ప్రాంతంలో శవమై తేలిన లక్కీ

25 Oct, 2016 23:07 IST|Sakshi
పొన్నాడ రేవు వద్ద లక్కీ మృతదేహాన్ని తీసుకువస్తున్న సహాయక సిబ్బంది
మూడు రోజుల తరువాత వీడిన ఉత్కంఠ
నిరుపేద కుటుంబంలో తీరని ఆవేదన
శోక సంద్రంలో తల్లిదండ్రులుచ బంధువులు
 
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : స్నేహితులతో కలిసి ఆటలు ఆడిన తరువాత ఉత్సహంగా గెంతులేసేందుకు నాగావళి నదికి స్నానానికి  వెళ్లిన లక్ష్మణ్‌కుమార్‌ అలియాస్‌ లక్కీ చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో లక్కీ తల్లిదండ్రులు  దుఃఖ సాగరంలోకి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే....పట్టణంలోని  తురాయి చెట్టువీధికి చెందిన లక్కీ  ఆచూకీ కోసం జిల్లా యంత్రాంగం నాగావళి నది పరివాహాక ప్రాంతంలో వెతగ్గా మంగళవారం ఉదయం 10గంటలకు మండలంలోని పొన్నాడ ప్రాంతంలో గుర్తుపట్టలేని విధంగా శవమై తేలాడు. మూడు రోజులుగా  కుటుంబ సభ్యులు, స్థానికులు, గజఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది క్షణం తీరిక లేకుండా వెతికారు.  చివరికి మంగళవారం  ఉదయం 10 గంటలకు పొన్నాడ రేవులో శవమై తేలాడు.  48గంటల తరువాత శవమై కనిపించడంతో తల్లిదండ్రులు బంధువులంతా గుండెలవిసేలా విలపించారు. లక్కీ మృతదేహం చూసిన ప్రతి ఒక్కరూ దుఃఖాన్ని దిగమింగుకోలేక  కన్నీళ్ల పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చడం అక్కడకు వచ్చిన వారికెవ్వరికీ సాధ్యపడలేదు. కోటి దేవుళ్లకు మొక్కినా తమ కొడుకు తిరిగివస్తాడనుకున్న ఆశలు అడియాశగానే మిగిలిపోయాయంటూ బంధువులంతా ఆవేదన చెందారు. లక్కీ చిట్టి చెల్లెలు నిఖిత తన అన్నయ్యతో కల్సి ఆడుకునే జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భోరున విలపించింది. లక్కీ మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. 
 
మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
లక్కీ మృతదేహం ఆచూకీ తెల్సిన వెంటనే ఎమ్మెల్యే గుండలక్ష్మీదేవి హుటాహుటినా పొన్నాడ ప్రాంతానికి చేరుకున్నారు. సహాయక చర్యలకు ఆదేశిస్తూ  లక్కీ తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సంఘటన తెలిసిన ఎన్‌టిఆర్‌ ఎంహెచ్‌స్కూల్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు లక్కీ నివాసానికి చేరుకున్నారు.
 
 
మరిన్ని వార్తలు