పిచ్చికుక్క కాటుకు బాలుడు బలి

21 Aug, 2016 01:24 IST|Sakshi
పాలకోడేరు : పిచ్చికుక్క కరిచి ఓ బాలుడు మరణించాడు. కుముదవల్లికి చెందిన సుందరమ్మ కుమారుడు చవల నాగేశ్వరరావు(15)ను రెండు నెలల క్రితం పిచ్చి కుక్క కరిచింది. అప్పటి నుంచి అతనికి భీమవరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో శనివారం బాలుడు మృతిచెందాడు. బాలుడు కుముదవల్లిలో పదో తరగతి చదువుతున్నాడు. అతని తల్లి భర్త చనిపోవడంతో ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట చేస్తూ.. కష్టపడి కొడుకు, కూతురును చదివించుకుంటున్నారు. కొడుకు మృతిచెందడంతో ఆమె తీవ్రంగా రోదిస్తున్నారు. బాలుడి మృతి వార్త తెలిసిన వెంటనే సర్పంచ్‌ తోట చిట్టిమరియమ్మ, ఉపసర్పంచ్‌ భూపతిరాజు వంశీకృష్ణంరాజు, కొండేటి లాజరు ఆ కుటుంబాన్ని పరామర్శించారు.  నాగేశ్వరరావు మృతికి ఎంఈవో కనుమూరి దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. పాఠశాలకు సెలవు ప్రకటించారు. 
కుక్కల బెడద అధికం
పాలకోడేరు మండలంలో ఏ గ్రామంలో చూసినా కుక్కల బెడద ఎక్కువగా ఉంది. రోడ్లపై తిరగాలంటేనే జనం హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కుక్కల బారి నుంచి కాపాడే నాథుడే లేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తక్షణం చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.  
 
మరిన్ని వార్తలు