మధ్యాహ్న వంటకు గుదిబండ

7 Mar, 2017 01:00 IST|Sakshi
మధ్యాహ్న వంటకు గుదిబండ
ఏలూరు సిటీ : సర్కారీ బడుల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డించే పథక నిర్వాహకులకు గ్యాస్‌ కష్టాలు వచ్చి పడ్డాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ఇప్పటికే నానా తంటాలు పడుతుంటే తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపు మరింత ఇబ్బందులు పెడుతోంది. మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం చెల్లిస్తున్న బిల్లులు సరిపోక, బిల్లులు సకాలంలో మంజూరు కాక ఆర్థికంగా దెబ్బతింటున్న నిర్వాహకులకు సిలిండర్‌ ధర గుదిబండగా మారింది. 
 
గ్యాస్‌ ట్రబుల్‌
మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్‌ ట్రబుల్‌ వచ్చింది. సిలిండర్‌ ధర భారంగా మారడంతో వంటకు కట్టెల పొయ్యిలే నయమని నిర్వాహకులు భావిస్తున్నారు. పాఠశాలలకు రాయితీపై సిలిండర్లను సరఫరా చేస్తారా లేదా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటంతో ఇబ్బందులు తప్పటం లేదు. ప్రస్తుతం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి వాణిజ్య గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ఇది నిర్వాహకులపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. తాజాగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,501కు చేరడం వీరికి మింగుడు పడటం లేదు. 
 
జిల్లాలో 936 పాఠశాలల్లో..
జిల్లాలో 3,236 పాఠశాలలు ఉంటే 936 బడుల్లోనే గ్యాస్‌తో వంట చేస్తున్నారు. మిగిలిన 2,300 పాఠశాలల్లో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. పాఠశాలల్లో గ్యాస్‌పైనే వంట చేయాలని కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశించినా ఫలితం శూన్యం. ఒక్కో పాఠశాలలో సగటున నెలకు 8 సిలిండర్లు వినియోగిస్తుండగా, వీటి కోసం రూ.12 వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తోందని నిర్వాహకులు అంటున్నారు. గ్యాస్‌ సిలిండర్ల కోసమే భారీగా ఖర్చు చేయాల్సి వస్తే పిల్లలకు నాణ్యమైన భోజనం ఎలా అందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
గ్యాస్‌ మంజూరుపై.. 
జిల్లాలోని ప్రభుత్వ బడులన్నింటికీ గ్యాస్‌ సిలిండర్ల మంజూరుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నెలాఖరు నాటికి గానీ గ్యాస్‌ సిలిండర్ల మంజూ రుపై ఉత్తర్వులు వచ్చే అవకాశాలు లేవంటున్నారు. ఒకవేళ గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేసినా సబ్సిడీ గ్యాస్‌ బండ ఇస్తారా, లేక సబ్సిడీయేతర సిలిండర్లా, కమర్షియల్‌ గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేస్తారా అనే అంశంపై స్పష్టత లేదు. దీంతో సబ్సిడీ సిలిండర్లు సరఫరా చేయకుంటే మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులే ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది. సబ్సిడీ లేని సిలిండర్‌ ధర కూడా తాజాగా రూ. 838 వరకూ పెరగడంతో భారం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
రాయితీ గ్యాస్‌ ఇవ్వాలి 
పాఠశాలలకు మంజూరు చేసే గ్యాస్‌ సిలిండర్లు సబ్సిడీపై ఇవ్వాలి. గ్యాస్‌ ధరలు పెరిగిపోవటంతో ఇబ్బంది పడుతున్నాం. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,502 ఉంటే, గృహోపయోగ సిలిండర్‌ ధర రూ.838 వరకూ ఉంది. రెండింటిలో ఏది ఇచ్చినా పిల్లలకు మంచి భోజనం పెట్టే పరిస్థితి లేదు.
– ఎస్‌.హైమావతి, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు
 
భారం భరించలేం
పాఠశాలలకు సరఫరా చేసే గ్యాస్‌ సిలిండర్‌కు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. పిల్లలకు ఇస్తున్న సొమ్ములు  నాణ్యమైన భోజనం పెట్టేందుకే చాలవు. ఇంకా గ్యాస్‌ కూడా మేమే భరించాలంటే ఇబ్బం దులు పడాల్సిందే. బిల్లులు సైతం సకాలంలో మంజూరు చేయక అప్పులు చేయాల్సి వస్తోంది. 
– పి.రంగమణి, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు
 
ప్రభుత్వం ఇవ్వనుంది
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ మంజూరు చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉంది. 
– ఆర్‌ఎస్‌ గంగాభవాని, డీఈఓ, పశ్చిమగోదావరి
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా