మొగల్తూరు ఘటనపై మెజిస్టీరియల్‌ విచారణ

13 Apr, 2017 03:23 IST|Sakshi
మొగల్తూరు ఘటనపై మెజిస్టీరియల్‌ విచారణ

నరసాపురం: మొగల్తూరు ఆనందా రొయ్యల ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనకు సంబంధించి మెజిస్టీరియల్‌ విచారణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఘటనలో మృతిచెందిన కార్మికులకు నష్టపరిహారంగా ఫ్యాక్టరీ ప్రకటించిన రూ.15 లక్షల నష్టపరిహారాన్ని బాధిత కుటుంబాలకు బుధవారం నరసాపురం మండలం సీతారామపురంలో మంత్రి పితాని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటనపై ఐఏఎస్‌ అధికారితో కూడిన బృందంతో విచారణ జరిపిస్తామని, ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. తుందుర్రు ఆక్వా ఫుడ్‌ పార్క్‌, మొగల్తూరు రొయ్యల ఫ్యాక్టరీల విషయంలో తాను మాట మార్చలేదన్నారు. జిల్లాలోని యనమదుర్రు డ్రెయిన్‌లో వ్యర్థాలు కలుపుతున్న ఫ్యాక్టరీలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫ్యాక్టరీల్లో తప్పనిసరిగా ట్రీట్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని, ఆరు నెలల్లో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఘోరాన్ని రోడ్డు ప్రమాదంతో పోల్చిన మంత్రి
మొగల్తూరు ఘటన మంత్రి పితాని రోడ్డు ప్రమాదంతో పోల్చారు. ఫ్యాక్టరీల యాజమాన్యం నిబంధనలు పాటించాలని, కార్మికుల రక్షణపై చర్యలు తీసుకోవాలని చెబుతూనే ఆనందా ఫ్యాక్టరీలో ప్రమాదం అనుకోకుండా జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా ఎలా జరుగుతాయో, ఇదీ అలాగే జరిగిందని వ్యాఖ్యానించడంతో పలువురు నోరెళ్లబెట్టారు.

ఊరేగింపుగా సీతారామపురం
నరసాపురం ఇరిగేషన్‌ అతిథి గృహం నుంచి సీతారామపురం వరకూ మంత్రి పితానిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆనందా ఫ్యాక్టరీ ఘటన మృతుల బంధువులను అధికారులు సీతారామపురం రప్పించారు. బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి మంత్రి పరామర్శిస్తారని, అక్కడే నష్టపరిహారం కూడా ఇస్తారని అంతా భావించారు. ఫ్యా‍క్టరీని కూడా మంత్రి పరిశీలిస్తారని అనుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా సీతారామపురంలో కార్యక్రమం ఏర్పాటుచేసి బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఐదుగురి మృతుల్లో నల్లం ఏడుకొండలు బంధువులు రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల నష్టపరిహారానికి సంబంధించి రూ.20 లక్షలు అందించామని, మిగిలిన రూ.5 లక్షలు త్వరలో అందజేస్తామని మంత్రి పితాని ప్రకటించారు. ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు, నరసాపురం సబ్‌కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ,  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పసుపులేటి రత్నమాల, జిల్లా నీటి సంఘాల అధ్యక్షుడు పొత్తూరి రామరాజు, చినమిల్లి సత్యనారాయణ, అండ్రాజు చల్లారావు, ఎంపీపీ వాతాడి కనకరాజు, జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్‌  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు