‘మహా’ ఒప్పందం చరిత్రాత్మకం

24 Aug, 2016 21:37 IST|Sakshi
‘మహా’ ఒప్పందం చరిత్రాత్మకం
గుండాల : మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న జల ఒప్పందం చరిత్రాత్మకంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమైక్యాంధ్ర నాయకులు సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. 40 సంవత్సరాలుగా వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తున్నప్పటికీ తెలంగాణకు చుక్క నీరు ఇవ్వని అసమర్థులు కాంగ్రెస్‌ వారు అని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్‌ కుదుర్చుకున్న 3 బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని, అది జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కానుందని కాలేశ్వరం ప్రాజెక్టుతో గంధమల్ల , బస్వాపూర్‌ రిజర్వాయర్ల ద్వారా ఆలేరు భువనగిరి నియోజకవర్గాలు సస్యశ్యామలం కానున్నట్లు ఆమె తెలిపారు. కొత్త ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేసి సాగు నీరు అందిస్తామన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చిందం ప్రకాశ్, జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్‌ గార్లపాటి సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ రావుల హరితాదేవి, కో–ఆఫ్షన్‌ మెంబర్‌ ఎండీ షర్పోద్దీన్, నాయకులు మూగల శ్రీనువాస్, ఇమ్మడి దశరథ, లగ్గాని రమేష్, తదితరులు ఉన్నారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు