నగరంలో మరో దివ్య క్షేత్రం

7 May, 2017 23:12 IST|Sakshi
నగరంలో మరో దివ్య క్షేత్రం
శ్రీ మహా కాళేశ్వరాలయానికి శంకుస్థాపన 
రాజమహేంద్రవరం కల్చరల్‌: ఆధ్యాత్మికత క్షేత్రాలకు ఆటపట్టయిన రాజమహేంద్రవరంలో మరో దివ్యక్షేత్రం రూపుదిద్దుకుంటోంది. అదే శ్రీ మహాకాళేశ్వరాలయం. ఉజ్జయినిలో కొలువుదీరిన శ్రీ మహాకాళేశ్వరుని సందర్శించుకోలేని భక్తులకోసం ఆ మహాదేవుడే గోదావరీతీరానికి విజయం చేయనున్నాడని  ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి పేర్కొన్నారు. రోటరీక్లబ్‌ ఆఫ్‌ రాజమండ్రి ఆధ్వర్యంలో ఆదివారం ఇన్నీసుపేట కైలాసభూమి పక్క ప్రాంగణంలో  శ్రీమహాకాళీ కాళేశ్వరాలయ శంకుస్ధాపన మహోత్సవంలో ఆధ్యాతిక, సారస్వత, రాజకీయరంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి మాట్లాడుతూ మనం చేసే ప్రతిపనీ భగవదర్పితం కావాలన్నారు. జ్ఞాన సరస్వతి డాక్టర్‌ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ కాలస్వరూపుడే కాళేశ్వరుడని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన రాజమహేంద్రవరానికి ఈ ఆలయం రావడం మన సుకృతమన్నారు. శాసనమండలి మాజీ సభ్యుడు కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ నగర ఆధ్యాత్మిక శోభను ఇనుమడించే విధంగా ఆలయం రూపుదిద్దుకోనుందన్నారు. హిమాలయవాసి సూర్యభాస్కర సరస్వతీస్వామి మాట్లాడుతూ కంటికి కనిపించేదంతా కనుమరుగైపోతుందన్నారు. భస్మాభిషేక ప్రియుడు, భస్మవిభూషిత సుందరుడు శంకరుడన్నారు. ఆలయ నిర్మాణకర్తలు పట్టపగలు వెంకటరావు దంపతులు, తోట సుబ్బారావు దంపతులు శంకుస్థాపన పూజల్లో పాల్గొన్నారు. నాలుగు ద్వారాలు, నాలుగు నందీశ్వరులు, నాలుగు మండపాలు, నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు రాజగోపురాలు, నాలుగు శివకోటి స్ధూపాలతో రెండేళ్లలో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని పట్టపగలు వెంకటరావు తెలిపారు. రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్, నగర మేయర్‌ పంతం రజనీ శేష సాయి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శివరామసుబ్రహ్మణ్యం, 20వ వార్డు కార్పొరేటర్‌ మింది నాగేంద్ర, సీతారాం మహేశ్వరి, పట్టపగలు ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు