ప్రజా హక్కులను కాలరాస్తున్నారు

3 Feb, 2017 00:00 IST|Sakshi
ప్రజా హక్కులను కాలరాస్తున్నారు

- పోరాటాలతోనే హంద్రీనీవా ఆయకట్టుకు నీరు
- 6న నిర్వహించే ధర్నాకు భారీగా తరలిరండి
- వైఎస్సార్‌సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి


బెళుగుప్ప : ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ, హంద్రీనీవా ద్వారా ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందించే వెసులుబాటు ఉన్నా పట్టనట్లు వ్యవహరిస్తూ ప్రజా హక్కులను కాలరాస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిలు విమర్శించారు. గురువారం బెళుగుప్ప, బెళుగుప్ప తండాలో పర్యటించి ఈనెల 6న ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ధర్నాకు హంద్రీనీవా ఆయకట్టు రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ  2014లో కొంత మందికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వగా.. 2015, 16 సంవత్సరాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇవ్వలేదన్నారు. అలాగే 2016లో పంటల బీమాను రైతులకు అందించలేదని ధ్వజమెత్తారు. హంద్రీనీవా ద్వారా 3.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉందన్నారు. 2014 నుండి 23 టీఎంసీల చొప్పున జీడిపల్లి రిజర్వాయర్‌కు వస్తున్నా ఎకరం ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందివ్వలేదన్నారు. ప్రజా పోరాటాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే సాగునీరు సాధ్యమన్నారు. రైతన్నలకు మద్దతుగా ఈనెల 6న ఉరవకొండలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో చేపట్టిన ధర్నాకు రైతులు తరలివచ్చి వచ్చే ఖరీఫ్‌కైనా సాగునీటిని తెచ్చుకుందాం అని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.5,500 కోట్లను ఖర్చు పెట్టి హంద్రీనీవా ప్రాజెక్టును నిర్మించారన్నారు. ఇదే ప్రాజెక్టు ఇప్పుడైతే రూ.30 వేల కోట్లను ఖర్చు చేయాల్సి వచ్చేదని చెప్పారు. అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి ఎన్నో సార్లు వచ్చినా ఒక్కసారి కూడా హంద్రీనీవా మొదటిదశ ఆయకట్టుకు సాగునీరు అందిస్తానని చెప్పకపోవడం బాధాకరమన్నారు. నీటి సాధనతో పాటు సమస్యలను పరిష్కరించుకునేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో చేస్తున్న ధర్నాకు రైతులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు