మళ్లీ మళ్లీ వస్తా: మహేశ్ బాబు

8 May, 2016 15:33 IST|Sakshi
మళ్లీ మళ్లీ వస్తా: మహేశ్ బాబు

బుర్రిపాలెం: తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెంలో విద్య, ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే తన లక్ష్యమని హీరో మహేశ్ బాబు అన్నారు. సొంతూరిని దత్తత తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ఆదివారం ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

బుర్రిపాలెంకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. బుర్రిపాలెం పాఠశాలను బాగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇక్కడకు మళ్లీ మళ్లీ వస్తానన్నారు. తెలంగాణలో తాను దత్తత తీసుకున్న గ్రామానికి వచ్చే వారం వెళ్లనున్నట్టు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలం సిద్ధాపూర్‌ గ్రామాన్ని కూడా ఆయన దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా, మహేశ్ బాబు రాక సందర్భంగా బుర్రిపాలెంలో పండగ వాతావరణం నెలకొంది. ఆయనను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. 70 మంది బౌన్సర్లతో 'ప్రిన్స్'కు భద్రత కల్పించారు.

మరిన్ని వార్తలు