వ్యభిచార దందాపై పోలీసుల ఉక్కుపాదం

29 Sep, 2016 17:54 IST|Sakshi

హైదరాబాద్: నగరంలో వ్యభిచార దందాను నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. అపార్ట్‌మెంట్లు, ఇళ్లలో వ్యభిచార దందా నిర్వాహకులను పట్టుకునే క్రమంలో ఆ ఇళ్లలో మైనర్లు దొరికితే మూడేళ్ల పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం మెజిస్ట్రేట్‌కు ఉందని, మేజర్‌లు దొరికితే మూడు నెలల నుంచి ఏడాది పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం ఉందని మహేష్ భగవత్ తెలిపారు.

గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. ఎల్‌బీనగర్, మల్కాజిగిరి జోన్లలో ఈ ఏడాది జూలై ఒకటి నుంచి ఇప్పటివరకు మహిళల అక్రమ రవాణాపై 23 కేసులు నమోదు చేసి 75 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందిన 40 మందికి వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. ఇటువంటి అరాచకాలు సాగకుండా ఉండేందుకు వ్యభిచార గృహాలను సీజ్ చేస్తున్నారు. రాచకొండ పోలీసుల అభ్యర్థన మేరకు నాలుగు అపార్ట్‌మెంట్‌లను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అండ్ డిప్యూటీ కలెక్టర్ కం తహసీల్దార్ సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు.

వీటిలో సరూర్‌నగర్ మండలం అల్కాపురిలోని దుగ్గిరాల అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నంబర్ 103, దిల్‌సుఖ్‌నగర్ లలితా నగర్‌లోని శిల్పి అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 106, సరూర్‌నగర్ కర్మన్‌ఘాట్‌లోని జ్యోతినగర్ రోడ్డు నంబర్ త్రీలోని రెండో అంతస్తు ప్లాట్ నంబర్ 22ను, కొత్తపేట న్యూ మారుతీనగర్ బాబు కాంప్లెక్స్‌లోని తొలి అంతస్తు 1-6-30ని సరూర్‌నగర్ తహసీల్దార్ సీజ్ చేశారు. అలాగే, వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇళ్లలో ఇకపై అటువంటి కార్యకలాపాలు ఆపేయాలని ఆరు అపార్ట్‌మెంట్‌లకు కూడా ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు