ఎట్టకేలకు సునీల్‌ అరెస్ట్‌

24 Apr, 2017 23:31 IST|Sakshi
ఎట్టకేలకు సునీల్‌ అరెస్ట్‌

సాక్షి, నిజామాబాద్‌ : వాణిజ్యపన్నులశాఖలో పన్ను ఎగవేత కుంభకోణం కేసులో ఏ–2 నిందితుడు సునీల్‌ను సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన ట్యాక్స్‌కన్సల్టెంట్‌ శివరాజ్‌ కుమారుడైన ఈ సునీల్‌ను సోమవారం అర్ధరాత్రి నిజామాబాద్‌ కోర్టులో ప్రవేశపెట్టేందుకు సీఐడీ అధికారులు హైడ్రామా నడిపారు. శివరాజ్‌తో పాటు, సునీల్‌ కూడా సుమారు మూడు నెలలుగా పరారీలో ఉన్నాడు. శివరాజ్‌ను గతనెల 23న అరెస్టు చూపించిన సీఐడీ అధికారులు, మరో నెల రోజుల అనంతరం సునీల్‌ను అరెస్టు చేయగలిగారు.

వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, కొందరు వ్యాపారులు కలిసి రూ.వందల కోట్లలో వ్యాట్, సీఎస్‌టీ ఎగవేశారు. ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ శివరాజ్, ఆయన కుమారుడు సునీల్‌లు ఈ కుంభకోణాన్ని నడిపారు. ఈ వ్యవహారంపై బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఫిబ్రవరి మొదటి వారంలో బోధన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివరాజ్, సునీల్‌లతో పాటు, బోధన్‌ సీటీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏసీటీఓ విజయ్‌కృష్ణ, మరో ఇద్దరు సిబ్బంది హన్మాన్‌సింగ్, వేణుగోపాల్‌లపై కేసు నమోదైన విషయం విధితమే. ఈ కేసులో మిగిలిన నలుగురు ఇప్పటికే అరెస్టు కాగా, తాజాగా సునీల్‌ కూడా అరెస్టు అయ్యాడు.

మరిన్ని వార్తలు