దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

1 Aug, 2016 18:06 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల ప్రతిఘటనకై నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వివిధ ట్రేడ్ యూనియన్‌ల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం సికింద్రాబాద్‌లోని మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో హింద్ మజ్దూర్ సభ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా సభకు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, టీఆర్‌ఎస్‌కేవీ, టీఎన్‌టీయూసీ, బ్యాంకు, ఇన్సూరెన్స్, రక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఫెడరేషన్‌ల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు..ఎన్‌డీఏ ప్రభుత్వం కార్మిక సమస్యల పరిష్కారం పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో ఉన్నదన్నారు. దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు, వివిధ రంగాల్లోని ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ ఐక్యంగా ప్రభుత్వం ముందుంచిన 12 డిమాండ్లను మొండిగా నిరాకరిస్తుందని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.

 

విదేశీ, స్వదేశీ కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందువల్ల కార్మిక, ఉద్యోగ సంఘాలు సమ్మె భేరీ మోగించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకై నిర్వహించ తలపెట్టిన ఈ సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది.

మరిన్ని వార్తలు