కోడ్‌ఆఫ్‌ డిసీప్లీన్ లో మార్పులు తేవాలి

4 Jan, 2017 22:56 IST|Sakshi
కోడ్‌ఆఫ్‌ డిసీప్లీన్ లో మార్పులు తేవాలి

► సీఐటీయూ అధ్యక్షుడు టి.రాజారెడ్డి
గోదావరిఖని : సింగరేణిలో కార్మిక సంఘాల ఉనికిని దెబ్బతీసేలా ఉన్న కోడ్‌ ఆఫ్‌ డిసీప్లీన్ లో మార్పులు తేవాలని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్  రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం జీడీకే 2వ గనిపై జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కోడ్‌ ఆఫ్‌ డిసీప్లీన్  పేరుతో యాజమాన్యం కార్మిక సంఘాలకు మాట్లాడే అవకాశాన్ని కల్పించడం లేదన్నారు. యూనియన్లు కొనసాగకుండా సభ్యత్వం చేయించుకునే వీలు కల్పించడం లేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కోడ్‌ ఆఫ్‌ డిసీప్లీన్ లో మార్పులు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని తమ యూనియన్ డిమాండ్‌ చేసిందన్నారు. అలాగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా కంపెనీ స్థాయిలో ఒక ఓటు, డివిజన్ స్థాయిలో మరో ఓటు వేసేలా కార్మికులకు అవకాశం కల్పించాలన్నారు.

ఇక వారసత్వ ఉద్యోగాల విషయంలో జారీ చేసిన ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉందని, షరతులు లేని వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి అనేక షరతులు పెట్టి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. యాజమాన్యం షరతులను పక్కనపెట్టి దత్తపుత్రులకు, కార్మికుల కూతుర్లకు కూడా ఉద్యోగావకాశాలు కల్పించేలా ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు టి.నరహరిరావు, మెండె శ్రీనివాస్, మల్లయ్య, మహేశ్, రామన్న, సత్తయ్య, చంద్రయ్య, ఈశ్వర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు