సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

30 Aug, 2016 23:27 IST|Sakshi

మహబూబ్‌నగర్‌: సీపీఎస్‌ రద్దు చేయాలని, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ కమిటీ నాయకులు అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి రెగ్యులర్‌ నియామకాలు చేసి శ్రమదోపిడిని అరికట్టాలన్నారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని అన్నారు. 9నెలల పీఆర్‌సీ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బైక్‌ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌ 2న డిమాండ్స్‌తో కూడిన బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాలని తీర్మానించారు. సమావేశంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి ఎన్‌.కిష్టయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేష్, జంగయ్య, డీటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వామన్‌కుమార్, శ్రీశైలం, టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణమ్మ, దేవెంద్రప్ప, టీజీపీఈటీఏ నిరంజన్, టీఎస్‌పీటీఏ ముజబుర్‌ రహమాన్, ఎస్టీఎఫ్‌ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు