'ఏపీ ప్రభుత్వానిది దగాకోరు బాట'

27 Oct, 2016 19:50 IST|Sakshi

దళితులను మోసగిస్తున్న సీఎం చంద్రబాబు
మాలమహానాడు జాతీయ అధ్యక్షులు కల్లూరి చెంగయ్య

విజయవాడ (గుణదల): ప్రభుత్వం తలపెట్టిన దళితబాట దగాకోరు బాటగా మారిందని, దళిత ప్రజలను మరోమారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంచిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య అన్నారు. దళిత నిరుద్యోగులను మభ్యపెట్టడానికి, చంద్రబాబు పాలనపై దళితులలో వస్తున్న అసంతృప్తిని అణచివేయటానికి పన్నిన కుట్రే చంద్రన్నబాటని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో దళిత వర్గాలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని గురువారం ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో చెంగయ్య ధ్వజమెత్తారు.

మూడు సెంట్లు భూమి, పరిశ్రమల స్థాపన కోసం బ్యాంకు పూచీకత్తులేకుండా వడ్డీలేని రుణాలు మంజూరు, భూమి కొనుగోలు పథకం అమలు కావటం లేదని, అసైన్డ్ భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వటంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. పరిశ్రమల పేరుతో గతంలో కాంగ్రెస్ పార్టీ దళితుల నుంచి బలవంతంగా తీసుకున్న లక్షా 20 వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంత వరకు ప్రణాళికలు కూడా రూపొందించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు చైర్మన్‌లను ఏర్పాటు చేయటం వంటి అంశాలపై ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా కేవలం ఎస్సీ రుణాలు మంజూరు పేరుతో ప్రచారం చేసుకుని సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని కల్లూరి చెంగయ్య ఆరోపించారు.

మరిన్ని వార్తలు