మల్లన్న భక్తులకు వనభోజనాలు

29 Oct, 2016 23:05 IST|Sakshi
మల్లన్న భక్తులకు వనభోజనాలు
- కార్తీక మాసంలో రోజుకు 1500 అభిషేకం టికెట్ల విక్రయం
·- ఆన్‌లైన్‌తోపాటు  దేవస్థానం అన్ని అతిథిగృహాలలో టికెట్ల లభ్యం
- క్యూలో ఉచితంగా పాలు, మజ్జిగ, పులిహోర ప్రసాదాలు
- కార్తీక పౌర్ణమిన నదీహారతులు, జ్వాలాతోరణం
 
 
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తులకు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ భరత్‌ గుప్త తెలిపారు. శనివారం దేవస్థానం పరిపాలనా భవనంలో ఆయన విలేకరులతో   మాట్లాడుతూ కార్తీకమాసంలో క్షేత్రానికి వచ్చిన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా క్యూ కాంప్లెక్స్, ఉచిత,ప్రత్యేక దర్శన క్యూలలో వేచి ఉండే భక్తులకు దేవస్థానం మంచినీరు, మజ్జిగ, పాలు, పులిహోర ప్రసాదాలను అందజేస్తామన్నారు. స్వామివార్లను అభిషేకం చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో రూ. 1500  ముందస్తు టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అలాగే మల్లికార్జునసదన్, గంగా సదన్‌ తదితర అతిథిగృహాలలో కూడా భక్తుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు ఐదారు విడుతలుగా, సాయంత్రం మరో విడతలో అభిషేకాల నిర్వహణ ఉంటుందని,  గర్భాలయంలో జరిగే రూ. 5వేల అభిషేకం టికెట్లను నియంత్రించి 20 నుంచి 25లోపు విక్రయించాలని భావిస్తున్నామని, రద్దీకనుగుణంగా ఈ టికెట్ల విక్రయం ఉంటుందని చెప్పారు. కార్తీక పౌర్ణమి ఈ ఏడాది సోమవారంతో కలిసి వచ్చిందన్నారు.  ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణవేణీ నదీమాతల్లికి అదేరోజు సాయంత్రం నదీహారతులు, రాత్రి 7గంటలకు గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.  
 
మరిన్ని వార్తలు