నకిలీ విత్తన కంపెనీలతో సంబంధాలు

16 Oct, 2016 02:41 IST|Sakshi
నకిలీ విత్తన కంపెనీలతో సంబంధాలు

సీఎం కేసీఆర్ కుటుంబంపై మల్లు భట్టివిక్రమార్క ధ్వజం
ఖమ్మంలో రైతు ఆక్రందన ధర్నా
రైతుల గోడు వినకపోతే వారి ఆగ్రహానికి గురవుతారు
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి
రైతులకు పరిహారం అందించకపోతే.. సీఎం ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం

ఖమ్మం: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబానికి నకిలీ విత్తన కంపెనీలతో సంబంధాలున్నాయని.. అందుకే ఆ కంపెనీలపై నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. పంటనష్టపోరుున రైతులకు పరిహారం అందించాలని, నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ  శనివారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన రైతు ఆక్రందన ధర్నాలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఉదయం ఎర్రుపాలెం మండలం జమలాపురంలో ప్రారంభమైన ఈ యాత్ర మధిర, వైరా నియోజకవర్గాల మీదుగా సుమారు 85 కిలోమీటర్ల మేర సాగి ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుంది. విక్రమార్క మాట్లాడుతూ రెండేళ్లుగా రైతులు పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

ఒకపక్క రైతులు పంట నష్టపోరుు ఇబ్బందుల పాలైతే వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాత్రం రైతులు పండుగ చేసుకుంటున్నారని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు పనిలేక పంటపొలాల్లో తిరుగుతున్నారని విమర్శలు చేసే మంత్రులు ఒక్కసారి పంటపొలాలను పరిశీలిస్తే పంటనష్టపోరుున రైతుల ఆవేదన తెలుస్తుందన్నారు. రైతు పక్షాన మాట్లాడుతుంటే వ్యవసాయ మంత్రి మాత్రం కాంగ్రెస్‌పార్టీది బ్రాందీ-గాంధీ వాదమని విమర్శిస్తున్నారని, ఆ వాదం ఎవరిదో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. ఇష్టారాజ్యంగా విత్తన కంపెనీలకు లెసైన్సులు ఇవ్వడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తనాల అమ్మకాలు సాగాయని, దీని వల్ల మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వెంటనే నకిలీ విత్తన కంపెనీలపై, లెసైన్సులు ఇచ్చిన ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

రైతుల నష్టానికి బాధ్యులైన వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంట్ అందించామన్నారు. అరుుతే, ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల కోసం కేంద్రం అందించిన రూ.800 కోట్లను కాంట్రాక్టర్లకు కట్టబెడుతుందన్నారు. వెంటనే రైతులకు పంటనష్టపరిహారం అందించకపోతే అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని, సీఎం దొరక్కపోతే అవసరమైతే ఆయన ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

 రైతుల ఆవేదన ఆక్రోషంలా మారకముందే వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జి దుదిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం నిద్ర మత్తులో తూగుతుందని, అందువల్లే రాష్ట్రంలోని రైతుల ఆక్రందనలు వారికి వినిపించడం లేదన్నారు. మిర్చి రైతులు ఎకరాకు రూ.లక్ష వరకు, పత్తి రైతులు ఎకరాకు రూ.40 వేల వరకు నష్టపోయారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, అనిల్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు అరుుతం సత్యం, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. తోపులాట
ఎర్రుపాలెం మండలం జమలాపురం నుంచి ప్రారంభమైన రైతు ఆక్రందన యాత్ర సాయంత్రం ఖమ్మంకు చేరుకోగానే రోటరీ నగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం డీఎస్పీ సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీలోని ట్రాక్టర్లను నగరంలోకి అనుమతించమని భట్టికి చెప్పారు. అరుుతే, పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కార్యకర్తలు తొలగించేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం జిల్లా ఎస్పీ షానవాజ్‌ఖాసీం ర్యాలీని ముందుకు సాగించేం దుకు అనుమతి ఇవ్వడంతో ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకుంది.

>
మరిన్ని వార్తలు