మద్యం తాగి.. నకిలీ నోటిచ్చి దొరికాడు

12 May, 2017 21:13 IST|Sakshi

షాద్‌నగర్‌ క్రైం: పూటుగా మద్యం తాగారు.. రాత్రి సమయం కావడంతో బార్‌ నిర్వాహకుడ్ని బిల్లు విషయంలో బోల్తా కొట్టించాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా తమ వద్ద ఉన్న పిల్లలు ఆడుకునే నోట్లను బిల్లు కట్టేందుకు ఇచ్చి అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని జైభవాని బార్‌ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించేందుకు సోలీపూర్‌ తండాకు చెందిన పొర్ర శంకర్‌ తన మిత్రుడైన కొత్తూరు మండలం రంగాపూర్‌ గ్రామానికి చెందిన తోట యాదగిరితో కలిసి వచ్చాడు.

ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వరకు పూటుగా మద్యం సేవించారు. రాత్రి సమయం కావడంతో నకిలీ నోట్లు ఇచ్చి బయట పడదామని నిర్ణయించుకుని పిల్లలు ఆడుకునే నకిలీ రూ. 2వేల నోట్లను రెండింటిని నిర్వాహకుడికి ఇచ్చారు. అనుమానం వచ్చిన బార్ నిర్వాహకుడు పరిశీలించి చూడగా నకిలీ నోట్లని తేలడంతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. తోట యాదగిరి అక్కడి నుండి పారిపోవడంతో పొర్ర శంకర్‌ను పట్టుకుని బార్‌ నిర్వాహకులు పోలీసులకు అప్పజెప్పారు. బార్ నిర్వాహకుడు అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ శ్రీనివాస చారి తెలిపారు.

మరిన్ని వార్తలు