వలస బతుకులపై మృత్యు పంజా..!

18 Jun, 2016 23:32 IST|Sakshi

 కడియం: జీవనోపాధే వారి పాలిట మృత్యుశాపమైంది. శ్రీకాకుళం నుంచి పొట్టకూటికి వెళ్లిన శ్రామికులను.. సెప్టిక్ ట్యాంకు కోసం వారు తవ్విన గొయ్యే మృత్యువై మింగేసింది. మట్టిపెళ్లలు విరిగిపడడంతో కడియం గ్రామం మేకలదిబ్బ ప్రాంతంలో నివసిస్తున్న శ్రీకాకుళం జిల్లా అత్తికొత్తూరు కు  చెందిన రౌతు సూరిబాబు(35), యర్లంకి పోలినాయుడు(30) అక్కడికక్కడే మరణించారు. వివరాల్లోకి వెళితే..
 
 బుర్రిలంక ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలో గ్రామానికి చెందిన శ్రీఘాకోళ్లపు పల్లపురాజు ఇటీవలే ఇల్లు నిర్మించుకున్నాడు. సెప్టిక్ ట్యాంక్ తవ్వించుకునేందుకు ఆరుగురు కూలీలతో ఒప్పందం కుదుర్చుకున్నా డు. సూరిబాబు, పోలినాయుడుతో పాటు మరో నలుగురు శనివారం ఉదయం పని మొదలెట్టారు. 11 గంటల సమయానికి రెండు ట్యాంకులను పక్కపక్కనే తవ్వారు. సిమెంటు ఒరలు దింపేందుకు సిద్ధమవ్వగా, సూరిబాబు, పోలినాయుడు నూతిలో ఉన్నారు. మిగిలిన నలుగురు పైనే ఉన్నారు.
 
  హఠాత్తుగా రెండు గొయ్యిల మధ్య ఉన్న మట్టిభాగం కూలిపోయింది. సూరిబాబు, పోలినాయుడు మట్టిపెళ్లల కింద చిక్కుకుపోయారు. అక్కడున్న నలుగురు అప్రమత్తమై, కొంత మట్టిని తొలగించినప్పటికీ వారి జాడ తెలియలేదు. మరోసారి పట్టిపెళ్లలు విరిగిపోవడమే కాకుండా, సమీపంలో ఉన్న బాత్రూంలు కొంతమేరకు ఒరిగిపోయాయి. సమాచారం అందుకున్న దక్షిణ మండలం డీఎస్పీ నారాయణరావు, కడియం ఇన్‌స్పెక్టర్ ఎం.సురేష్ తమ సిబ్బందితోను, రాజమహేంద్రవరం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
 
  స్థాని కుల సాయంతో మట్టిని తొలగించే పనులు చేపట్టారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 2.15 సమయానికి సూరిబాబు మృతదేహాన్ని వెలికితీశారు. సుమారు 3.20కి పోలినాయుడు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇన్‌స్పెక్టర్ ఎం.సురేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూరిబాబుకు భార్య సుజాత, కుమారులు పదేళ్ల పూనా కుమార్, ఏడేళ్ల అభినయ కుమార్ ఉన్నారు. పోలినాయుడికి భార్య సుజా త, పదో తరగతి చదివిన శ్రావణి, ఎనిమిదో తరగతి చదువుతున్న రామకృష్ణ ఉన్నారు. వీరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు