కరెంట్‌ కాటేసింది

25 Jul, 2017 23:37 IST|Sakshi
నిడదవోలు రూరల్‌: నిడదవోలు మండలంలోని శెట్టిపేట శివారులో కాకరపర్రు రెగ్యులేటర్‌ కాంట్రాక్టర్‌ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఖమ్మం గోపాలకృష్ణ (66) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతిచెందినట్టు పట్టణ ఎస్సై జి.సతీష్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆచంట గ్రామానికి చెందిన గోపాలకృష్ణ ఏడేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం భార్య రాధమ్మతో వచ్చి రెగ్యులేటర్‌ వద్ద వాచ్‌మెన్‌గా చేరాడు. అప్పటినుంచి రెగ్యులేటర్‌ నిర్మాణానికి వినియోగించే సామాన్లను భద్రంగా చూడటంతో పాటు కాకరపర్రు లాకుల వద్ద పనిచేసే ఇరిగేషన్‌ సిబ్బందికి చేదోడువాదోడుగా ఉంటూ అక్కడే నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోజుమాదిరిగానే మంగళవారం ఉదయం రెగ్యులేటర్‌ కార్యాలయం ముందు ఉన్న కొండాలమ్మవారిని దర్శించుకుని లైట్లు ఆపడానికి స్వీచ్‌ ఆన్‌చేయగా షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతదేహం వద్ద భార్య రాధమ్మ, బంధువులు గుండెలవిసేలా రోదించారు. గోపాలకృష్ణ మంచి వ్యక్తిని, నమ్మకంతో పనిచేసేవాడని ఇరిగేషన్, రెగ్యులేటర్‌ కాంట్రాక్టర్లు గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు. లాక్‌ సూపరింటెండెంట్‌లు చిక్కాల బ్రహ్మజీ, రాజు, నీటిసంఘం అధ్యక్షుడు బూరుగుపల్లి శ్రీనివాసరావు శవపంచానామ కార్యక్రమాలను పర్యవేక్షించారు. భార్య రాధమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీష్‌ చెప్పారు. 
 
మరిన్ని వార్తలు