కాలువలో వ్యక్తి గల్లంతు

24 Sep, 2016 21:28 IST|Sakshi
కాలువలో వ్యక్తి గల్లంతు
శాలిగౌరారం
శాలిగౌరారం ప్రాజెక్టు కుడి అలుగు కాలువలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండల కేంద్రానికి చెందిన అమరగాని పవన్‌కుమార్‌(36) తన భార్యతో కలిసి సంవత్సర కాలంగా నకిరేకల్‌లో నివాసం ఉంటున్నాడు. పవన్‌కుమార్‌ భార్య జానకి ప్రస్తుతం శాలిగౌరారం గ్రామంలో ఐకేపీ ఏపీఎంగా పనిచేస్తున్నారు.   పవన్‌కుమార్‌ తన స్నేహితుడైన శాలిగౌరారం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నాగరాజుతో కలిసి శనివారం ద్విచక్రవాహనంపై మండలకేంద్రానికి వచ్చారు. ఏఈ నాగరాజు  విధులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో వయా ఆకారం మీదుగా నల్లగొండకు బయలుదేరారు. ఈ క్రమంలో శాలిగౌరారం ప్రాజెక్ట్‌కు కుడిఅలుగుకు అనుసంధానంగా ఉన్న గండికుంట మీదుగా వెళ్లే క్రమంలో కల్వర్టు పైనుంచి వస్తున్న వరదనీటిని దాటుతున్నారు. పవన్‌కుమార్‌ ద్విచక్రవాహనం దిగి కాలినడకన కల్వర్టును దాటే క్రమంలో కాలుజారి వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఏఈ నాగరాజుతో పాటు ఆ ప్రాంతంలోని ఉన్నవారు లబోదిబోమనే సరికి నీటిలో మునుగుతూ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వరద ప్రవాహాం ఉధృతంగా ఉండటం వలన అక్కడ ఉన్న స్థానికులు కాపాడలేకపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అయోధ్య సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గల్లంతైన పవన్‌కుమార్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టిన రాత్రి వరకు  ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటన స్థలంలో బిక్కుబిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ, డీఎస్పీ
పవన్‌కుమార్‌ కాల్వలో గల్లంతైన విషమం తెలుసుకుని నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్‌లు సాయంత్రం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం తీసుకుంటున్న సహాయకచర్యలను తెలుసుకున్నారు. వరద ఉధృతి ఏ విధంగా ఉందని అధికారులతో సమీక్షించారు.
 
 
మరిన్ని వార్తలు