ఆయకట్టు.. తీసికట్టు

23 Jul, 2016 21:14 IST|Sakshi
ఆయకట్టు.. తీసికట్టు
సిబ్బంది కొరతతో పొలాలకు చేరని నీళ్లు
2 వేల క్షేత్రస్థాయి సిబ్బందికి గాను ప్రస్తుతం 700 మందే..
రెండేళ్లుగా ఒక్క పోస్టూ భర్తీ చేయని టీడీపీ ప్రభుత్వం 
 
నాగార్జున సాగర్‌.. రెండు జిల్లాల ప్రజల గుండె చప్పుడు.. తన పాదస్పర్శతో బీడు భూములను సైతం సిరుల పంటగా మార్చి రైతు ముంగిళ్లను ఆనంద పరవళ్లు తొక్కించే ప్రజా బాంధవి. తొండలు గుడ్లు పెట్టే భూములని చెప్పుకునే వాటికీ రూ.లక్షల ధర పలికిస్తూ.. ఆయకట్టును సస్యశ్యామలం చేస్తూ రైతు జీవనయానంలో మమేకమై సాగిపోతున్న రైతు నేస్తం.. ఇలాంటి సాగర్‌ నేడు పర్యవేక్షణ కరువై.. వివాదాలకు నెలవై తన పరిధిలో ఆయకట్టును కన్నీరు పెట్టిస్తోంది. తన బాగోగులు చూసుకోవాల్సిన సిబ్బందిని ప్రభుత్వం నియమించకపోవడంతో నిత్యం వేదనతో ఘోషిస్తోంది. 
 
నరసరావుపేట: నియోజకవర్గంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ ఆయకట్టు భూములు నానాటికీ కళ తప్పుతున్నాయి. ఒక ఏడు సరైన వర్షాలు లేక ప్రాజెక్ట్‌ నుంచి సాగు నీరందలేదు. కొద్దోగొప్పో నీటిని విడుదల చేసినా ఆ నీరు రైతుల పొలాలకు చేరలేదు. కనీసం పశువులు, తాగునీటి అవసరాలకు సక్రమంగా నీటిని పంపిణీ చేసేందుకు కూడా కాలువలపై క్షేత్రస్థాయి సిబ్బంది లేరు. దీంతో సాగు నీరు పెట్టుకునే విషయంలో రైతుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాజెక్ట్‌ నిర్మించినప్పటి కంటే ఇప్పుడు ఆయకట్టు విస్తీర్ణం పెరిగింది. అయినా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. 
 
నాగార్జునసాగర్‌ కుడికాలువ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 202 కిలోమీటర్లు పొడవునా విస్తరించి ఉంది. కుడికాలువ కింద బ్రాంచ్, మేజర్, మైనర్‌ కాలువలు వందల కిలోమీటర్లలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో 11.74 లక్షల ఎకరాల ఆయకట్టు సాగర్‌ జలాలపై ఆధారపడి ఉంది. దీంతోపాటు అనుమతిలేని, ప్రభుత్వ లెక్కల్లోలేని సుమారు లక్ష ఎకరాలకు పైబడి మాగాణి, మెట్ట పంటలకు సాగు నీరు అందాల్సి ఉంది. కాలువల డిజైన్‌ సమయంలో మెట్ట భూములుగా స్థిరీకరణ చేసిన 6.85 లక్షల ఎకరాల్లో సుమారు 3.5 లక్షల ఎకరాలు మాగాణి భూములుగా మారాయి.
తాగు నీటికీ ఇదే ఆధారం..
 కొన్ని వందల చెరువులకు తాగునీరు, లక్షల్లో పశువుల కుంటలకు తాగు నీరు అందిస్తూ ఏటా 25 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తికి ఈ నీరే ఆధారమవుతోంది. కానీ ప్రాజెక్ట్‌ పరిధిలో  క్షేత్రస్థాయి సిబ్బంది అయిన లస్కర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు సరిపడినంతlమంది లేరు. పెరిగిన మాగాణి భూముల ఆయకట్టు, ప్రభుత్వ లెక్కల్లో లేని ఒక లక్ష ఎకరాల మెట్ట, మాగాణి భూములు కొత్తగా సాగులోకి రావటంతో చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. 
నియామకాల ఊసే లేదు..
కొంతకాలంగా ఉద్యోగ విరమణ చేసిన, లేదా సర్వీసులో మతి చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించలేదు. పదోన్నతిపై బదిలీ అయిన ఖాళీలు, క్ష్రేత్రస్థాయి సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. శాశ్వత ప్రాతిపదికపైన 2 వేల మంది క్షేత్రస్థాయి సిబ్బంది అవసరం కాగా ప్రస్తుతం 700 మందే పని చేస్తున్నారు. రాబోయే రెండేళ్లల్లో ఉద్యోగ విరమణల రూపంలో భారీగా ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇటీవల తాగునీటి కోసం సాగర్‌ జలాలు విడుదల చేసిన సమయంలో క్షేత్రస్థాయి సిబ్బంది లేక పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని వినియోగించుకోవాల్సి వచ్చింది. సిబ్బంది లేకపోతే సాగు, తాగు నీరు వినియోగం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారుతోంది. 
మరిన్ని వార్తలు