సెల్ఫీ తెచ్చిన తంటా!

21 Oct, 2016 16:43 IST|Sakshi
సెల్ఫీ తెచ్చిన తంటా!

ఆత్మకూర్‌: స్నేహితులతో సరదాగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన ఓ యువకుడు సెల్ఫీ దిగుతూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. పూర్తి వివరాలిలా.. గురువారం మహబూబ్‌నగర్‌కు చెందిన చింటు (25) తన ఎనిమిది మంది స్నేహితులతో కలిసి మూడు ద్విచక్రవాహనాలపై ప్రాజెక్టు సందర్శనకు వచ్చాడు. ప్రధాన ఎడమ కాల్వ 0 కిలోమీటరు నుంచి 1వ కిలోమీటరు బ్రిడ్జి వద్ద సాయంత్రం 5 గంటల ప్రాంతంలో యువకులందరు ఈత కొట్టేందుకు నీటిలో దిగారు. ముగ్గురు యువకులు సెల్ఫీ దిగుతుండగా అలల తాకిడికి నీటిలో పడిపోయారు.

వరద ఉధృతికి అధికంగా ఉండటంతో ఇద్దరు యువకులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. చింటు మాత్రం గల్లంతవ్వడంతో యువకులు అరుపులు కేకలు వేశారు. అక్కడున్న మత్స్యకారులు,  రైతులు వెంటనే నీటిలో దూకి గాలింపు చేపట్టినా జాడ లభించలేదు. కాసేపటి తర్వాత యువకులు భయభ్రాంతులకు గురై అక్కడినుంచి చెప్పాపెట్టకుండా పారిపోయారు. అనంతరం రైతులు వీఆర్‌ఓ పంచజన్యంకు సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు విషయాన్ని తెలిపారు. సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ సీహెచ్‌ రాజు తన సిబ్బందితో అక్కడికి వెళ్లి రాత్రి 9 గంటల వరకు మృతదేహం కోసం మత్స్యకారులతో గాలించారు. పీజేపీ అధికారులతో మాట్లాడి వరద ఉధృతిని తగ్గించినా ఆచూకీ లభించలేదు. సంఘటన స్థలంలో ఇండియన్‌ ఆయిల్‌ బ్లూ షర్ట్, ప్యారగాన్‌ చెప్పులున్నాయి. వెంట వచ్చిన యువకులు కనీసం సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారని సీఐ తెలిపారు. చింటూ అంటూ యువకులు కేకలు వేశారని రైతులు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు