పల్నాడులో మండపోరులో భక్తులు

12 Dec, 2016 15:15 IST|Sakshi
పల్నాడులో మండపోరులో భక్తులు

 

  • ఆకట్టుకున్న కత్తి సేవలు, ఆయుధాలకు గ్రామోత్సవాలు
 
కారంపూడి: వీరాచారవంతులు కత్తులతో గుండెలపై బాదుకుంటూ ఆవేశంతో ఊగిపోతుండగా బ్రహ్మనాయుడు ఆయుధం నృరసింహకుంతం వారిపై ఒరిగి శాంతింప చేసింది. ఉత్సాలకు వచ్చిన ప్రతి ఆచారవంతుడు తమ ఆయుధాలతో వంతులవారీగా కత్తి సేవలు చేసుకున్నారు. వీరులగుడితోపాటు అంకాళమ్మ ఆలయం, బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద బుధవారం మందపోరు జరిగింది. ఈ సందర్భంగా వీరుల ఆయుధాలకు నీరాజనాలు పలికారు.
భక్తిపారవశ్యం
 వీరులగుడిలో పొంగళ్లు చేసుకుని నాగులేరులో ఆయుధాలను శుభ్రపరుచుకున్నారు. మహిళలు పొంగళ్లతో ఆయుధాల వెంట నడిచారు. పలనాటి యుద్ధంలో వీర మరణం పొందిన వారిని స్మరించుకుంటూ కత్తి సేవల్లో లీనమయ్యారు. మహిళలకు పూనకాలతో ఊగిపోయారు. విషాద వదనాలతో చివరకు బిగ్గరగా ఏడడం లాంటి సంఘటనలు ఆకట్టుకున్నాయి. అనంతరం చెన్నకేశవస్వామి, అంకాళమ్మ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో బ్రహ్మనాయుడుగా భావించే పీఠాధిపతి తరుణ్‌చెన్నకేశవకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయుధాలకు గ్రామోత్సవాలు నిర్వహించారు. పోతురాజుకు ప్రత్యేక మొక్కుబడులు చెల్లించారు.  
 
చాపకూడు సిద్దాంతం అమలు
బ్రహ్మనాయుడు చాపకూడు మండపం ఆవరణలో చాపకూడు సహపంక్తి భోజనాలు నిర్వహించారు. పీఠాధిపతి పిడుగు తరుణ్‌చెన్నకేశవ, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్, కొమ్మారెడ్డి చలమారెడ్డి తదితరులు అన్నరాసులకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 5 వేల మంది సహపంక్తి భోజనాలు చేశారు. 
కథ వింటూ రాత్రంతా జాగారం...
వీరులగుడిలో రాయబార కథాగానం బుధవారం తెల్లవారు జాము వరకు సాగింది. ఉదయగిరికి చెందిన వీర విద్యావంతుడు చీమలదిన్నె చెన్నయ్య(75) కథాగానం చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. ఆచారవంతులు సపర్యలు చేశాక ఆయన కోలుకున్నారు. తర్వాత చీరాలకు చెందిన ముద్రగడ వెంకటేశ్వర్లు కథాగానం కొనసాగించారు. తోటవారిపాలేనికి చెందిన కత్తుల గోపి, కందుకూరుకు చెందిన గోవర్దన్, మంగళగిరికి చెందిన ముక్కంటి, వీరన్నకోట నరసింహం, దర్శికి చెందిన సింహాద్రి, వెన్నపూసల వెంకటేశ్వర్లు తదితరులు కథాగానాలు చేయడానికి వచ్చారు. పీఠాధిపతి తరుణ్‌ సమక్షంలో ఆచారవంతులు గుడిలో వీరంగం వేశారు.
నేడు కోడి పోరు
పల్నాటి వీరారాధనోత్సవాల్లో భాగంగా గురువారం కోడిపోరు జరగనుంది. బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మల మధ్య అలనాడు జరిగిన కోడిపోరును బ్రహ్మనాయుడుగా పీఠాధిపతి,  ఆచారవంతుడు నాగమ్మ వేషంలో కోడిపోరు సంప్రదాయం కోసం ప్రదర్శిస్తారు. బ్రహ్మనాయుడు పుంజు రతనాల చిట్టిమల్లు, నాయకురాలు పుంజు శివంగిడేగల మధ్య రెండుసార్లు జరిగిన పోరులో నాయకురాలు పుంజు ఓడిపోతుంది. అనంతరం ఓడిన వారు ఏడేళ్లు అరణ్యవాసం చేయాలనే షరతుతో మలిపోరు జరుగుతుంది. అప్పటికే అలసిపోయిన చిట్టిమల్లు నాయకురాలు కొత్త పుంజుపై ఓడిపోతుంది. వీరవిద్యావంతుల కథాగానం అనంతరం సంప్రదాయబద్ధంగా వీటిని నిర్వహిస్తారు. వీరులగుడి ఆవరణలో జరిగే వేడుక కార్యక్రమంలో వేలాదిగా జనం పాల్గొంటారు. వైఎస్సార్‌ సీపీ సీఎల్పీ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.  
 
పోటోలు 30ఎంహెbŒlఆర్‌ఎల్‌45 వీరులగుడిలో ఆవేశంతో కత్తి సేవలు చేసుకుంటున్న వీరాచారవంతులు, 46 కధాగానం, 50 కత్తి సేవలు వీక్షిస్తున్న పీఠాధిపతి, 141 వీరులగుడిలో అర్ధరాత్రి కత్తి సేవ, 142 చాపకూడు అన్నంరాశికి పూజలు చేస్తున్న జెడ్పీఛైర్మన్‌ జానీమూన్, పీఠాధిపతి తరణ్‌చెన్నకేశవ
 
 

మరిన్ని వార్తలు