మా(మి)డి పోతోంది

22 Apr, 2016 03:02 IST|Sakshi
మా(మి)డి పోతోంది

మండుతున్న ఎండలు..ఎండుతున్న చెట్లు
తీవ్ర వర్షాభావంతో కాతలేని తోటలు
నష్టం రూ.100 కోట్లపైనే..
ఐదు శాతం ఉత్పత్తులూ కరువే..
వేసవిలో ‘మధుర ఫలం’ ప్రియమే

వేసవిలో నోరూరించే మధురఫలం మామిడి ఈసారి కరువైంది. మున్నెన్నడూలేని విధంగా తీవ్ర వర్షాభావంతో తోటలన్నీ నిర్వీర్యమయ్యాయి. పూత లేటుగా రావటం.. వచ్చినా కొద్దిపాటి పూత ఎండ తీవ్రతతో రాలిపోయింది. జిల్లాలో ఏ తోటలో చూసినా ఐదు శాతం మించి కాత లేదంటే అతిశయోక్తి కాదు. ఫలితంగా జిల్లాలో 9వేల హెక్టార్లలో సాగులో ఉన్న మామిడి తోటలకు రూ.100 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖ అంచనా వేస్తున్నది. - గజ్వేల్

గజ్వేల్: మెతుకుసీమ మామిడి తోటల సాగుకు పేరుగాంచింది. జిల్లాలో 9 వేల హెక్టార్లకుపైగా తోటలు సాగువుతున్నాయి. దశాబ్దాలుగా ఈ తోటల వల్ల మంచి ఫలసాయం పొందుతూ లాభాలు ఆర్జిస్తున్న రైతులకు నాలుగేళ్లుగా వాతావరణ ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా మామిడికి నవంబర్, డిసెంబర్ నెలాఖరు వరకు పూత రావాల్సి వుంటుంది. కానీ ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పూత రాలేదు. జనవరి నెలాఖరులో వచ్చినా ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల రాలిపోయింది. ఏ మామిడి తోటలో చూసినా 10 నుంచి 20 శాతానికి మించి పూత రాలేదు. గజ్వేల్‌కు చెందిన గాలెంక నర్సింలు అనే రైతుకు పదెకరాల మామిడితోట ఉంది. ప్రస్తుతం వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల ఆ రైతు తోటలో పూత లేకపోవడం, వచ్చినా రాలిపోవడంతో కళావిహీనంగా దర్శనమిస్తున్నది. ఫలితంగా ఆ రైతు పెట్టుబడి కూడా నష్టపోయే పరిస్థితి తలెత్తింది. పదెకరాల్లో తనకు సుమారు 6 లక్షలకుపైగా నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తున్నదని రైతు వాపోయాడు. జిల్లాలోని రైతులందరూ ఇదే స్థితిని ఎదుర్కొంటున్నారు.

 నష్టం తీరిదీ...
జిల్లాలో 9వేల హెక్టార్లలో మామిడి సాగులో ఉన్నది. అంటే 22,500 ఎకరాలు అన్నమాట. నిజానికి వాతావరణం కలిసొస్తే ఎకరాకు 12 నుంచి 18 టన్నుల దిగుబడి వచ్చి ప్రతీ రైతుకు రూ.50 వేలకుపైగా ఆదాయం సమకూరుతుంది. కానీ అయిదు శాతం మించి ఏ తోటలోనూ కాతలేదు. చాలా చోట్ల తోటల్లో కాతే రాలేదు. అందువల్ల ఎకరాకు 50వేల చొప్పున 22,500 ఎకరాల్లో సుమారు 100కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. ఈ నష్టం తీరుపై ఉద్యాన శాఖ అంచనా వేస్తున్నది. తోటలు పూర్తిగా దెబ్బతిన్న కారణం చేత ఈసారి మధురఫలం ప్రజలకు ప్రియం కానున్నది. పచ్చళ్లకు మొదలుకొని తినడానికి కూడా మామిడి దొరకని పరిస్థితి ఏర్పడనున్నది. స్థానిక అవసరాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.

 ‘బీమా’ లేక కరువైన ‘ధీమా’...
మామిడితోటలకు కొంతకాలంగా ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తున్నపటికీ దీనిపై ప్రచారంలేక రైతులు వినియోగించుకోలేకపోతున్నారు. ప్రతిఏటా డిసెంబర్ నెలలో ఈ బీమాకు సంబంధించిన ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. కానీ విషయం తెలియక  ఎక్కడా ప్రీమియం చెల్లించిన దాఖలాలులేవు. నష్టానికి బీమా కూడా పొందే అవకాశంలేక రైతులు దిగాలు చెందుతున్నారు.

ప్రభుత్వానికి నివేదిస్తాం...
జిల్లాలో మామిడి తోటల నష్టాన్ని అంచనా వేస్తున్నాం. మున్నెన్నడూలేని విధంగా రైతులు నష్టపోయారు. తోటల్లో 5నుంచి 10శాతం కూడా కాత లేదు. రైతులు భారీగా నష్టపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
-రామలక్ష్మీ,  ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్

మరిన్ని వార్తలు