‘మంజునాథ కమిషన్‌ గో బ్యాక్‌’

21 Mar, 2017 23:26 IST|Sakshi
‘మంజునాథ కమిషన్‌ గో బ్యాక్‌’
కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : అర్హత లేని కులాలను బీసీ జాబితాలో ఎలా చేరుస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్‌ ప్రశ్నించారు. అధ్యయనం చేసేందుకు బుధవారం కాకినాడ వస్తున్న మంజునాథ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బర్ల సీతారత్నం ఆధ్వర్యంలో ‘మంజునాథ కమిషన్‌ గో బ్యాక్‌’ అంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కంబాల చెరువు నుంచి దేవీచౌక్, గోకవరం బస్టాండ్‌ మీదుగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకూ నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. గోకవరం బస్టాండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం చేరుకుని బైఠాయించారు. వెంకట మహేష్‌ మాట్లాడుతూ రిజర్వేషన్ల శాతాన్ని పెంచకుండా బీసీ జాబితాలో చేర్చడాన్ని తమ సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అర్హత లేని కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర జనాభాలో 55 శాతం కంటే పైగా ఉన్న బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తున్నారని, దానిని 50 శాతానికి పెంచాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకే ఎసరు పెడుతున్నారన్నారు. ఒక కమిషన్‌ ఏర్పాటు చేసి బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తమాషా చేస్తోందన్నారు. రాష్ట్ర బీసీ విద్యార్థి ఫెడరేషన్‌ అధ్యక్షుడు లద్దిక మల్లేష్, బీసీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్, నాయకులు రాయుడు రాకేష్, బండారు రాజేశ్వరరావు, గెడ్డం నాగరాజు, విత్తనాల శివ వెంకటేష్, విష్ణు, సాయిరాంసింగ్, ప్రశాంత్, కోటి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు