సంయమనం పాటించాలి

21 Mar, 2017 23:42 IST|Sakshi
సంయమనం పాటించాలి
- ప్రశాంతంగా విజ్ఞాపనలు అందజేయాలి
- రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మంజునాథ
- రెవెన్యూ, పోలీసు అధికారులతో సమీక్ష
కాకినాడ సిటీ : వెనుకబడిన తరగతుల్లో కొన్ని కులాలను చేర్చడానికి, అలాగే బీసీ కులాల గ్రూపుల మార్పు అంశాలపై ఆయా కులాల నుంచి విజ్ఞాపనలు స్వీకరిస్తామని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ తెలిపారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి, ప్రశాంతంగా తమ విజ్ఞాపనలు అందజేయాలని కోరారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన, కమిషన్‌ సభ్యులు మంగళవారం రాత్రి కాకినాడ చేరుకున్నారు. ప్రజల నుంచి విజ్ఞాపనల స్వీకరణకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, జిల్లా ఎస్‌పీ ఎం.రవిప్రకాష్, రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్‌పీ బి.రాజకుమారి, ఇతర అధికారులతో ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమీక్షించారు. జిల్లాలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయం, పశుగణాభివృద్ధి, ఆక్వా రంగాల్లో అభివృద్ధిని జస్టిస్‌ మంజునాథ తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ కులాలు, వారి ఆర్థిక స్థితిగతులపై కూడా సమీక్షించారు. జిల్లాలో సాధికారత సర్వేలో వివిధ కులాల వివరాలను సేకరించామని, ఈ సర్వే 88 శాతం పూర్తయిందని చైర్మన్‌కు కలెక్టర్‌ వివరించారు. విజ్ఞాపనల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను ఎస్‌పీ రవిప్రకాష్‌ వివరించారు. జస్టిస్‌ మంజునాథ మాట్లాడుతూ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో వివిధ కులాల ప్రజలు, ఆయా కులాల నాయకుల నుంచి బుధవారం విజ్ఞాపనలు స్వీకరిస్తామని తెలిపారు. 23వ తేదీన జిల్లాలోని పలు గ్రామాల్లో వివిధ కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తామన్నారు. సమావేశంలో కమిషన్‌ సభ్యులు ప్రొఫెసర్‌ వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్‌ మల్లెల పూర్ణచంద్రరావు, ప్రొఫెసర్‌ శ్రీమంతుల సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, జేసీ-2 జె.రాధాకృష్ణమూర్తి, డీఆర్‌ఓ బీఎల్‌ చెన్నకేశవరావు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు