కూలీలుగా వచ్చి.. పేలుడు పదార్థాలు సేకరించి

11 Aug, 2016 21:41 IST|Sakshi
కూలీలుగా వచ్చి.. పేలుడు పదార్థాలు సేకరించి
ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించేందుకు మావోయిస్టుల ప్రణాళిక 
భారీగా మందుగుండు సామగ్రి చోరీ చేసి రహస్య ప్రాంతంలో నిల్వ 
వారం రోజుల్లో తరలించేందుకు వ్యూహం
ఫోన్‌ కాల్స్‌ డేటా ఆధారంగా గుర్తింపు 
ఉమ్మడి ఆపరేషన్‌తో కుట్ర భగ్నం
 
కర్నూలు: 
ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన నలుగురు మావోయిస్టుల అరెస్టు కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. అవుకు మండలం మెట్టుపల్లి వద్ద జరుగున్న గాలేరు–నగరి టన్నెల్‌ పనుల వద్ద కూలీలుగా అవతారమెత్తిన మావోయిస్టులను పోలీసులు ‘ఉమ్మడి ఆపరేషన్‌’తో అరెస్ట్‌ చేశారు. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం బస్తర్‌ పోలీస్‌ రేంజ్‌ పరిధిలోని ఏడు జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. అక్కడి పోలీసులు మావోయిస్టులపై ఒత్తిడి పెంచడంతో మిలిషియా కమాండర్‌గా ఉన్న కవాసి భీమా(22)తో పాటు పోడియం లక్మా లక్మా(26), హిడ్‌మా కర్టామి(22), కట్టాడు ఉంగా(22) తదితరులు మకాం మార్చి గాలేరు–నగరి టన్నెల్‌ వద్ద కూలీలుగా చేరారు. మొదట నెలల మాసాల క్రితం కవాసి భీమా టన్నెల్‌ పనుల్లో కూలీగా చేరి పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని తిరిగి వారి ప్రాంతానికి వెళ్లి మిగిలిన ముగ్గురిని కూడా తీసుకువచ్చి కూలీలుగా కుదిర్చాడు.

మావోయిస్టు నాయకులతో ఇక్కడి నుంచే ఫోన్‌లో సంబంధాలు కొనసాగిస్తూ పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేసేందుకు వ్యూహరచన చేశారు. టన్నెల వద్ద బ్లాస్టింగ్‌ మెటీరియల్స్‌ను పెద్ద మొత్తంలో చోరీ చేసి రహస్య ప్రదేశంలో దాచి వుంచారు. మరో వారం రోజుల్లో ఛత్తీస్‌ఘడ్‌కు రవాణా చేసేందుకు ప్రణాళిక రచించారు. అయితే ఛత్తీస్‌ఘడ్‌లో లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఫోన్‌ కాల్స్‌ డేటా ఆధారంగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
‘ఆపరేషన్‌’ సాగిందిలా... 
ఛత్తీస్‌ఘడ్‌ పోలీస్‌ టీమ్‌ బస్తర్‌ సైబర్‌ సెల్‌ ఇన్‌చార్జి మోహన్‌నాయుడు, ఏఎస్‌ఐలు శివాజి, సంతోష్‌బగేల్, హెడ్‌ కానిస్టేబుల్‌ సుశీల్‌ బరువా తదితరులతో కూడిన బృందం పక్కా సమాచారంతో మూడు రోజుల క్రితం అవుకులో తిష్ట వేశారు. గాలేరు–నగరి టన్నెల్‌ పనుల్లో ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన సుమారు 60 మంది కూలీలు పనిచేస్తున్నారు. వారిలో పై నలుగురిపై రెండు రోజుల పాటు పక్కా నిఘా ఉంచారు. పుష్కర విధుల్లో ఉన్న జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణకు రాష్ట్ర పోలీసు అధికారుల ద్వారా సమాచారం చేరడంతో జిల్లా పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. డోన్‌ సీఐ వై.శ్రీనివాసులు, అవుకు, బనగానపల్లె, కొలిమిగుండ్ల, డోన్‌ ఎస్‌ఐలు సుబ్రహ్మణ్యంరెడ్డి, వెంకటరామిరెడ్డి, సి.ఎం.రాకేష్, పులిశేఖర్, కానిస్టేబుళ్లు కృష్ణయ్య నాయుడు, సూర్యప్రకాష్, రమేష్, నగేష్‌తో పాటు మరికొంతమంది పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులతో ఉమ్మడి ఆపరేషన్‌ నిర్వహించారు.

బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు టన్నెల్‌ ప్రాంతంలో పోలీసులను మొహరించి నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ ఆకే రవికృష్ణ కూడా అవుకు చేరుకుని పోలీసు బృందాలకు తగు సూచనలిస్తూ పేలుడు పదార్థాల రహస్య ప్రదేశంపై దాడులు నిర్వహించారు. వారి నుంచి ఏడు జిలెటిన్‌ స్టిక్, 28 డిటోనేటర్స్, 20 బూస్టర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం వారిని మీడియా ఎదుట హాజరుపరచి వివరాలను వెల్లడించిన అనంతరం బనగానపల్లె కోర్టులో హాజరుపరిచారు.   
  
వీరి నేరాల చిట్టా... 
ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా చింద్‌గడ్‌ మండలం పెద్దపార వీరి స్వగ్రామం. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో వీరిపై అనేక కేసులు ఉన్నాయి. కవాసి భీమా మిలిషియా కమాండర్‌గా, కాట్టె కల్యాణ్‌ ఏరియా కమిటీలో సెక్రటరీ జగదీష్, ఇన్‌చార్జి కమాండర్‌ డి.సి.ఎం.దేవా నేతత్వంలో వీరు అనేక విధ్వంసాలకు పాల్పడ్డారు. 

– 2014 సాధారణ ఎన్నికల ముందు ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని జగ్బల్‌పూర్‌ దగ్గర జీరంలో ఎన్నికల ప్రచారంలో విధ్వంసం సష్టించి 43 మంది కాంగ్రెస్‌ నాయకులను అంతమొందించారు. కాంగ్రెస్‌ ప్రముఖ నాయకుడు విద్యాచరణ్‌ శుక్లా, మహేంద్ర కర్మా మతి చెందిన విధ్వంసంలో కవాసి భీమా ప్రముఖ పాత్ర పోషించాడు. 

– పోడియం లక్మా లక్మా, హిగ్‌మా కర్టామి, కట్టాడు ఉంగా తదితరులు దళ కమాండర్‌ కవాసి భీమాతో కలసి మాన్‌కాపాల్‌ వద్ద జరిగిన ఫైరింగ్‌లోను, గాంధీరామ్‌ పీఎస్‌ పరిధిలో జరిగిన ఎన్నికల బూత్‌ విధ్వంసం, తోంగ్‌పాల్‌ పీఎస్‌ పరిధిలో నేషనల్‌ హైవే విధ్వంసం సంఘటనల్లో పాలుపంచుకున్నారు.
 
పోలీసులకు నగదు రివార్డు 
నలుగురు మావోయిస్టులను చాకచక్యంగా పట్టుకుని వారు పన్నిన కుట్రను భగ్నం చేసినందుకు ఛత్తీస్‌ఘడ్‌ పోలీస్‌టీమ్‌తో పాటు కర్నూలు జిల్లా పోలీసులకు ఎస్పీ ఆకే రవికృష్ణ నగదు రివార్డులు ప్రకటించారు. సుకుమా జిల్లా ఎస్పీ కళ్యాణ్‌తో కలసి నగదు రివార్డును ఎస్పీ ఆకే రవికృష్ణ ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులకు అందజేశారు.

 

మరిన్ని వార్తలు