విరగబూసిన పూలు.. విలపిస్తున్న రైతులు !

31 Aug, 2016 00:00 IST|Sakshi
విరగబూసిన పూలు.. విలపిస్తున్న రైతులు !
- గుచ్చుకుంటున్న గులాబీ
– కంటతడి పెట్టిస్తున్న కనకాంబరం
– లొల్లి చేస్తున్న లిల్లీ
– బాధపెడుతున్న బంతి
– ధరలు లేక అల్లాడుతున్న రైతులు 
 
తాడేపల్లి రూరల్‌ :
 ‘గులాబీలు గుచ్చుకుంటున్నాయి. కనకాంబరాలు కంటతడి పెట్టిస్తున్నాయి. లిల్లీ పూలు లొల్లి చేస్తున్నాయి. బంతి పూలు సైతం బాధపెడుతున్నాయి. అసలు ఈ సంవత్సరం పూలు ఎందుకు సాగు చేశామురా.. దేవుడా..’ అంటూ రైతులు కన్నీరుపెడుతున్నారు. తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక, కుంచనపల్లి, మెల్లెంపూడి, వడ్డేశ్వరం తదితర ప్రాంతాల్లో రైతులు అధికంగా పూలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పూలు విరగబూశాయి. అయితే గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు.
ధర కన్నా కూలి ఎక్కువ !
– మార్కెట్‌లో దళారులు రైతుల నుంచి వంద గులాబీ పూలను ఐదు రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. రైతు మాత్రం ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు పూలు కోసిన ఒక్కో మహిళకు రూ.80 ఇవ్వాల్సి వస్తోంది. గులాబీ రేటు తలుచుకుంటేనే గుండెల్లో ముళ్లు గుచ్చుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు.  
– కనకాంబరాలు ధర చెబితేనే కంటనీరు పెట్టుకుంటున్నాడు. కేజీ కనకాంబరాలు రైతుల వద్ద నుంచి రూ.60లకు కొనుగోలు చేస్తున్నారు. పూలు కోయించినందుకు కూలీ మాత్రం రూ.100 చెల్లించాల్సి వస్తోంది. 
– కిలో లిల్లీ పూలు రూ. 20, బంతిపూలు రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు తోటను తీసేయలేక, పూలను పారబోయలేక రైతులు సతమతమవుతున్నారు. రేటు వచ్చేవరకు కోయకుండా ఉంచితే తోట పూర్తిగా పాడవుతుందని చెబుతున్నారు. కూలీలు, పెట్టుబడి ఖర్చులు కూడా రావడంలేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 
కర్ణాటక నుంచి పూల దిగుమతి వల్లే.. 
ధరలు అనూహ్యంగా తగ్గడానికి కర్ణాటక నుంచి అధికంగా పూలు మార్కెట్‌కు రావడమేనని వ్యాపారులు చెబుతున్నారు. తాము రైతుల వద్ద పూలు కొనుగోలు చేసినా.. విక్రయించలేక రెండురోజుల్లో చెత్తకుండీల్లో పడేయాల్సి వస్తోందని తెలిపారు.  
 
 
మరిన్ని వార్తలు