ఏజెన్సీలో గంజాయి గుస్సా!

15 Feb, 2018 11:20 IST|Sakshi
యువత ఉపయోగిస్తున్న గంజాయి పీల్చే మట్టి గొట్టాలు

పెచ్చుమీరుతున్న విష సంస్కృతి

వ్యసనం బారిన పడి చెడు మార్గంలో పయనిస్తున్న యువత?  

ఏజెన్సీలో అమాయక గిరిజనులు విష సంస్కృతికి అలవాటుపడుతున్నారా...అంటే! అవుననే సమాధానం వస్తోంది. గంజాయి మత్తులో తమకు తెలియని పోకడలకు అలవాటుపడుతున్నట్టు పెద్దలు ఆందోళన చెందుతున్నారు. బెట్టింగ్, పేకాట, మద్యానికి ఏజెన్సీ యువత బానిసలై చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారా? అంటే అవుననే సమాధానం చెప్పాలి.

కురుపాం: ప్రశాంతమైన ఏజెన్సీలో యువత పెడమార్గాన పయనిస్తూ కొద్ది నెలలుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. కురుపాం పరిసర గ్రామాల్లో గిరిజన యువత గంజాయి, పేకాట, మద్యం మత్తులో తూగుతున్నట్టు ఏజెన్సీ ప్రాంత పెద్దలు ఆందోళన చెందుతున్నారు. వీరికి ఒడిశా ప్రాంతం నుంచి గంజాయిని కొందరు సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఈ మత్తుకు యువత ఎక్కువగానే అలవాటుపడ్డట్టు తెలుస్తుంది. స్థానిక కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు సైతం గంజాయికి అలవాటు పడినట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. క్రికెట్‌ బెట్టింగ్, పేకాట వైపు కూడా వీరి చూపు మరలుతున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. ఈ చెడు వ్యసనాల నేపథ్యంలోనే చిల్లర దొంగతనాలకు సైతం అలవాటు పడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి.

వరుస దొంగతనాలతో బేజారు...
ఇటీవల నాలుగు నెలల కిందట అఫీషియల్‌ కాలనీలో ఓ గృహిణి చేతిగాజులు మెరుగుపెడతామని చెప్పి గాజులతో ఓ వ్యక్తి ఉడాయించాడు. మూడు నెలల కిందట శివ్వన్నపేటకు చెందిన ఓ వృద్ధురాలు పూలను ఏరేందుకు వెళ్లగా ఆమె చెవిలో బంగారు దుదుద్లను ఓ యువకుడు తెంపేసి పారిపోయాడు. తాజాగా మూడు రోజుల కిందట కేజీబీవీలో ఉద్యోగం చేస్తున్న మరో మహిళ విధులకు ఒంటరిగా వెళ్తుండగా కురుపాం ఆస్పత్రి సమీపంలో ఆమె కంట్లో కారం చల్లి పుస్తెలతాడును లాక్కొని పారిపోయాడు. ఇలా వరుస సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇటువంటి సంఘటనలు తామెరుగమని యువతే చెడుమార్గం పట్టి ఇలా చేస్తున్నారన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.  స్థానికంగా జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో పోలీసులు చొరవ తీసుకొని వీటికి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే ప్రమాదమేనని పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు