పెళ్లి వాహనాల అడ్డగింత

21 May, 2017 00:22 IST|Sakshi
 ∙నూతన వధూవరులతో కలసి పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నా
∙పోలీసుల తీరును తప్పుబట్టిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త  ఉషా, ఎల్‌ఎం 
కళ్యాణదుర్గం : రోడ్డు భద్రతా నియమాల పేరుతో పెళ్లి వాహనాలను పోలీసులు అడ్డగించడం వివాదాస్పదమైంది. పెళ్లి బందం ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి, వేధించడంతో నూతన వధూవరులతో సహా బంధువులు కలసి కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్‌ ముందు శనివారం రాత్రి బైఠాయించారు. వారికి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి మద్దతు తెలిపా రు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్టేషన్‌ ముందు ధర్నా కొనసాగింది. గరుడాపురానికి చెందిన రామకష్ణ అనే యువకుడి పెళ్లి అనంతరం పెళ్లి బందం ట్రాక్టర్‌లో బోరంపల్లికి బయలుదేరింది. కంబదూరు మండలం కురాకులపల్లికి చెందిన రామ్మోహన్‌ పెళ్లికి హాజరైన బంధువులు కూడా మరో వాహనంలో బెళుగుప్ప మండలం బూదవర్తికి బయలుదేరారు.

సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ శంకర్‌రెడ్డి తమ సిబ్బందితో కలసి రెండు పెళ్లి వాహనాలను పట్టుకుని, స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు ఉషా, ఎల్‌ఎం పోలీసుల తీరును తప్పుపట్టారు. పెళ్లి వాహనాలు వదిలే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించారు. సీఐ, ఎస్‌ఐ పలుమార్లు చర్చలు జరిపినా వారు వినలేదు. తమకు ఎస్పీ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారు. చంటి బిడ్డల తల్లులు, చిన్నారులు ఆకలి, దాహంతో అలమటించారు. పోలీసుల తీరు పట్ల శాపనార్ధాలు పెట్టారు. కాగా ఇంత తతంగం జరుగుతుండగానే టీడీపీకి చెందిన వారి పెళ్లి లారీలు తమ కళ్లెదుటే వెళ్తున్నా పోలీసులు పట్టించుకోకవడం కొసమెరుపు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు