అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

10 Oct, 2016 00:25 IST|Sakshi
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
  • కొన్నాళ్లుగా అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు  
  • కట్టుకున్నోడే హత్య చేశాడని మృతురాలి బంధువుల ఆరోపణ 
  • అనాథగా మిగిలిన ఏడాదిన్నర చిన్నారి
  • ఆగ్రహంతో అత్తింటిని తగులబెట్టిన స్థానిక మహిళలు
  • సీతారాంపురం(దేవరుప్పుల) : తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఓ యువతి అత్తింటి వరకట్న దాహానికి బలైన సంఘటన శనివారం రాత్రి సీతారాంపురంలో జరిగింది. మృతురాలి తండ్రి మల్లయ్య కథనం ప్రకారం.. మండలంలోని సీతారాంపురానికి చెందిన ఆవుల ఉప్పలయ్య, మైసమ్మ దంపతుల మూడో కుమారుడు తిరుమలేష్‌ అస్సోంలో బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన వన్నెకాల మల్లయ్య, అంజమ్మ కూతురు హైమ(23)ను అతడు రెండున్నరేళ్ల క్రితం ప్రేమించాడు. ఒకే సామాజిక వర్గం(కుర్మ) కావడంతో పెద్దల సమక్షంలో 2014 మేలో లాంఛనంగా తొమ్మిది లక్షల కట్నం ఇచ్చి వివాహం చేశారు. వారి దాంపత్యంలో కుమార్తె మోక్షిత జన్మించింది. తిరుమలేష్‌ సెలవులు దొరికినప్పుడు ఇంటికి వచ్చిపోయేవాడు. ఈ క్రమంలో భర్త, అత్త, మామలు ఆదనపు వరకట్నం కోసం డిమాండ్‌ చేయగా ఆమె పుట్టింటివారు రాఖీ పండుగ సమయంలో రూ.2 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినా వారిలో మార్పు రాలేదు. దీంతో ఆమె పుట్టిం ట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో శనివారం సద్దు ల బతుకమ్మ ఆడేందుకు హైమ చెరువు వద్దకు వెళ్లగా భర్త తిరుమలేష్‌ అక్కడికి వచ్చి వెంట తీసుకెళ్లాడు. సుమారు గంటన్నరపాటు వారి మధ్య సంభాషణ జరుగుతుండగా అనుమా నం కలిగిన గ్రామస్తులు  వాకబు చేయగా ఏమీ లేదని వెళ్ల్లగొట్టాడు. ఈ సమయంలోనే మాయమాటలు చెప్పి ఆమెకు థమ్సప్‌లో పురుగుల మందు కలిపి తాగించాడు. అనంతరం ఆమె ను పుట్టింట్లో దింపి వెళ్లాడు. తల్లిదండ్రులు ఇంటికొచ్చి చూసేసరికి హైమ నోట్లో నుంచి నురుగులు రావడంతో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. హైమ మృతిపై మృతురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
     
    ఇంటికి నిప్పుపెట్టిన స్థానికులు 
    హైమపై అత్తింటివారి వేధింపులను గతంలో స్వయంగా చూసిన స్థానికులు ఆమె మృతితో కోపోద్రిక్తులయ్యారు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అత్తగారికి చెందిన రెండు ఇళ్లను తగులబెట్టారు. దీంతో పెద్దఎత్తున మంటలు లేచి పరిసరాలకు ప్రమాదం వాటిల్లే స్థితిలో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక వాహనాన్ని రప్పించి మం టలార్పేందుకు యత్నించగా మహిళలు పూర్తి గా తగులపడాల్సేందేనని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైమ మృతిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకునేలా కేసు నమోదు చేస్తామని, విధ్వంసం సరికాదని ఎస్సై గడ్డం నరేందర్‌రెడ్డి సముదాయించడం తో ఆందోళనకారులు శాంతించారు. అయితే ఆదివారం రాత్రి మృతదేహాన్ని అత్తింటి ఎదుట ఉంచి తమ ఆందోళనను కొన సాగించారు. హైమ కూతురికి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. పాలకుర్తి, కొడకండ్ల ఎస్సైలు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ కలిసి తదుపరి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా చర్యలు తీసుకున్నారు. 
మరిన్ని వార్తలు