గుడికి తీసుకెళ్లలేదని..తనువు చాలించింది

2 Jun, 2016 02:33 IST|Sakshi
గుడికి తీసుకెళ్లలేదని..తనువు చాలించింది

పెళ్లిరోజు క్షణికావేశంలో ఘటన

 పెళ్లి రోజు కదా.. అని ఉదయం నుంచి సంబురంగా ఉంది. అందరినీ నవ్వుతూ పలుకరించింది. ఆ రోజంతా హాయిగా ఉందామనుకుంది. గుడికెళ్దామంటే..భర్త రానన్నాడని క్షణికావేశంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని..అర్ధంతరంగా తనువు చాలించింది.

వేంసూరు: క్షణికావేశమో..ఇంకేమైనా అయిందో కానీ..కల్లూరుగూడెం వివాహిత రామనబోయిన స్వాతి (25) మంగళవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లిరోజే ఈ ఘటన జరగడంతో అత్తారింట్లో విషాదం నెలకొంది. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా మట్టంగూడెం గ్రామానికి చెందిన స్వాతికి 2013లో కల్లూరుగూడెం గ్రామానికి చెందిన రామనబోయిన నరేంద్రతో వివాహం జరిగింది. ఈయన ఫొటో గ్రాఫర్‌గా జీవిస్తున్నాడు. మంగళవారం వీరి పెళ్లి రోజు కావడంతో..స్వాతి ఊరిలోని గుడికి వెళ్లి పూజలు చేద్దామని భర్తను కోరింది.

అయితే..ఆయన నిరాకరించాడు. వివాహ దినోత్సవం రోజున కోరిన కోరికను కాదన్నాడని మనస్తాపం చెందిన ఆమె..ఇంట్లోని గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు తేరుకునే లోగానే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి..మంగళవారం రాత్రి అంత్య క్రియలు జరిపించారు. మృతురాలి తల్లి, సోదరుడు గుండెలవిసేలా రోదించారు. ఈ మృతిపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు