మాస్టర్‌ప్లాన్‌లో మాయాజాలం

12 Dec, 2016 14:50 IST|Sakshi
పదుల సంఖ్యలో మార్పులు చేర్పులు 
ప్రజాప్రతినిధుల సిఫార్సులు 
పంచాయతీల్లోని భూములకు కార్పొరేటర్ల వత్తాసు 
ప్రతిపాదించిన రోడ్లు ఉపసంహరణ, జోన్లు మార్పు 
చేతులు మారిన కోట్ల రూపాయలు
బహుమతులుగా ప్లాట్లు, పొలాలు
పేదల ఇళ్లు పోతున్నాయన్నా పట్టించుకోని నేతలు
 
సాక్షి, రాజమహేంద్రవరం:  రాష్ట్ర విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య నగరంగా, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరం నగర విస్తరణకు తాజాగా ఆమోదించిన నూతన మాస్టర్‌ప్లాన్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. రోడ్ల వెడల్పు, కొత్త రోడ్ల ప్రతిపాదనలు, జోన్ల ఎంపికలో పలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మాస్టర్‌ ప్లాన్లో కేవలం రోడ్ల విభజన, జోన్ల ఏర్పాటు వంటి వాటినే ప్రస్తావించగా, వాటిని కూడా అధికారపార్టీ నేతలు తమ స్వలాభం కోసం నచ్చినట్లుగా మార్చుకున్నారు. తమ ఆస్తుల విలువ పెరగడం కోసం ఆయా ప్రాంతాల్లో అవసరం లేకున్నా రోడ్లు వేయడం, తమ, తమ అనునూయల ఆస్తులకు నష్టం వాటిల్లుతుందంటే ఆ ప్రతిపాదనలను ఉపసంహరించడం వంటి అనేక మాయా జాలాలు మాస్లర్‌ ప్లాన్లో చేశారు. పలువురు సీనియర్‌ కార్పొరేటర్లు అధికార బలంతో తమ పరిధికాని డివిజన్లు, పంచాయతీల్లోని ప్రజల వినతులకు సిఫార్సులు చేసి ఆమోదించుకోవడం విశేషం. ఈ వ్యవహారాల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. రోడ్డు వెడల్పు చేయడం వల్ల తమ ఇళ్లు పోతున్నాయని పేదలు, మధ్య తరగతి ప్రజలు విన్నవించినా పట్టించుకోని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పాలక మండలి, అధికార పార్టీ ఎమ్మెల్యే, పలువురు కార్పొరేటర్లు ప్రతిపాదించిన సిఫార్సులకు మాత్రం ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ‘సై’ అంది.
కార్పొరేటర్ల అభ్యంతరాలు, సూచనలతో మొదలు... 
రాజమహేంద్రవరం నగరంలో 2031 సంవత్సరం నాటికి అభివృద్ధిని అంచనా వేస్తూ 2014లో నూతన మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. నగర చుట్టుపక్కల ఐదు కిలోమీట్లర పరిధిలోని ప్రాంతాలను నగరంలో కలుపుతూ ఈ మాస్టర్‌ప్లాన్ను తయారు చేశారు. నగర చుట్టుపక్కల ఉన్న 13 పంచాయతీలు కొత్తగా మాస్టర్‌ ప్లాన్ పరిధిలోకి వచ్చాయి. మాస్టర్‌ ప్లాన్పై అభ్యంతరాలు, సూచనలు తెలపాలంటూ యంత్రాంగం నగర ప్రజలను కోరింది. దీనిపై దాదాపు 600 సూచనలు, అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో రోడ్లు వెడల్పులు పెంచడం, తగ్గించడం, జోన్ల మార్పిడి, నూతన రోడ్లు ఉపసంహరణ వంటి ప్రతిపాదనలున్నాయి. వీటిపై నగరపాలక మండలి చర్చించి ఆమోదయోగ్యమైన సలహాలు, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంది. మాస్లర్‌ప్లాన్పై పాలక మండలి మూడుసార్లు సమావేశమైంది. మొదటిసారి ఇతర అంశాలు ఉండడం, ప్రజల అభ్యంతరాలు, సూచనలు ఆంగ్లంలో ఉండడంతో తెలుగులోకి మార్చి ఇవ్వాలని వాయిదా వేశారు. రెండోసారి కార్పొరేటర్ల అభ్యంతరాలు తెలపడానికి ప్రత్యేకంగా వాయిదా వేశారు. ఇక్కడే పలువురు కార్పొరేటర్లు 50 అభ్యంతరాలు, సిఫార్సులు చేశారు. ఈ నెల 3వ తేదీన మూడోసారి మాస్టర్‌ ప్లాన్పై సమావేశమైన పాలక మండలి ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్ర కార్పొరేటర్లు  చర్చ జరగాలని పట్టుబట్టినా ఎకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం. 
‘పరిధి’దాటిన సిఫార్సుల ‘చిత్రాలు’...
మాస్టర్‌ ప్లాన్పై కార్పొరేటర్ల అభ్యంతరాలు తెలపడం కోసం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యూహాత్మకంగా రెండోసారి పాలక మండలి సమావేశాన్ని వాయిదా వేయించారు. ఇక్కడే మాస్టర్‌ ప్లాన్లో అనేక ‘చిత్రాలు’ చోటుచేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. పలువురు కార్పొరేటర్లు, అధికార పార్టీ ప్రజాప్రతినిధికి కాసుల వర్షం కురిపించుకునే అవకాశం కుదిరింది.
నగరంతోపాటు మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి వచ్చే పంచాయతీల ప్రజలు తమ పొలాలు, ఆస్తులు కాపాడుకునేందుకు వారిని ఆశ్రయించారు. తమ పొలం, ప్లాట్లు నుంచి పోతున్న రోడ్లను ఉపసంహరించడం, వెడల్పు తగ్గిండం, జోన్లు మార్పు వంటి వినతులు అందజేశారు. రోడ్ల వెడల్పు పెంచడం వల్ల దుకాణాలు, రోడ్ల పక్కన విలువైన స్థలాలు కోల్పోతుండడంతో వ్యాపారస్తులు, రియల్‌ వ్యాపారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధి, నగరపాలక మండలిలో అధికారపార్టీ ముఖ్య నేతలను ఆశ్రయించారు.
కానుకగా  కాసులు, ప్లాట్లు
మాస్టర్‌ ప్లాన్లో మార్పులు చేర్పులు వల్ల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. నగదుతోపాటు నచ్చిన వారికి వారివారి రియల్‌ వెంచర్లలో ప్లాట్లు కానుకగా ఇచ్చినట్లు తెలిసింది. మరికొందిరికి విలువైన బహుమతులు సిఫార్సులు చేయించుకున్నవారు అందించినట్లు నగరంలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎన్నికల్లో మా కార్పొరేటర్‌ పెట్టిన ఖర్చు మాస్టర్‌ప్లాన్ వల్ల తీరిందని వారి ఆనుచరులు చర్చించుకుంటున్నారు. నగర అభివృద్ధిని ఫణంగా పెట్టి అధికారపార్టీలో ముఖ్య నేతలుగా ఉన్న పలువురు కార్పొరేటర్లు తమ ఆస్తులను కాపాడుకోవడం లేదా విలువ పెంచుకోవడం కోసం అధికారాన్ని బాగా ఉపయోగించుకున్నారని ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. 
ఇవీగో సిఫార్సులు
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దాట్ల సుభద్రాదేవీతోపాటు ఇతరులకు చెందిన ప్లాట్లలో రోడ్డు వెళుతుండడంతో ఆ రోడ్డును ఉపసంహిరించాలని సిఫార్సు చేసి తొలగింపజేశారు. 10వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు కోలమూరు పంచాయతీలో మూడు ఎకరాలు ఇండస్ట్రియల్‌ జోన్ నుంచి కమర్షియల్‌ జోన్కు మార్చాలని సిఫార్సు చేశారు. 8వ డివిజన్ కార్పొరేటర్‌గా, టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న వర్రే శ్రీనివాసరావు పిడింగొయ్యి గ్రామ పంచాయతీలో 60 అడుగుల రోడ్డు ప్రతిపాదన ఉపసంహరించాలంటూ సిఫార్సు చేశారు. 9వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న కోసూరి ఛండీప్రియ కోలమూరు గ్రామంలో ఏడు ఎకరాల భూమి ఎన్విరాన్మెంటల్‌ బఫర్‌ జోన్ నుంచి నివాస ప్రాంత జోన్గా మార్చాలంటూ సిఫార్సు చేశారు. 44, 48, 38 డివిజన్ల కార్పొరేటర్లుగా ఉన్న పాలవలస వీరభద్రం, గరగా పార్వతి, నండూరి వెంకటరమణ  కోలమూరు, పిడింగొయ్యి పంచాయతీల్లో పరిశ్రమజోన్లో ఉన్న భూమిని రెసిడెన్సియల్‌ జోన్ మార్చాలని సిఫార్సు చేశారు. 
మరిన్ని వార్తలు