ప్రసవ వేదన

7 Oct, 2016 22:28 IST|Sakshi
ప్రసవ వేదన

– ఏటా పెరుగుతున్న ప్రసూతి మరణాలు
– ఆరేళ్లలో 358 కేసులు
– తాజాగా మాతాశిశువు మృతి

 
అనంతపురం మెడికల్‌ : మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కారణంగా మాతాశిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున గుత్తికి చెందిన సువర్ణ (20) మొదటి కాన్పులోనే రక్తహీనతతో ప్రసవ వేదన పడి బిడ్డతో సహా మత్యుఒడికి చేరింది.  గుత్తి మండలం బేతాపల్లికి చెందిన ఆమె తన పుట్టిన ఊరు గుత్తికి ఐదు నెలల గర్భం ఉన్నప్పుడే వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడి ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు పర్యవేక్షణ చేయాల్సి ఉంది. కానీ సువర్ణ విషయంలో  సరిగా పర్యవేక్షణ లేదు. ఈ క్రమంలో ఆమె తీవ్ర రక్తహీనతకు గురైంది. నిబంధనల ప్రకారం ఏడో నెల నుంచి తప్పనిసరిగా ఏఎన్‌ఎంలు గర్భిణుల ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వివరాలను ఎంసీపీ (మదర్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌) కార్డులో నమోదు చేయాలి.

కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. హైరిస్క్‌ కేసు అని తేలితే క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉంచాలి. 108 వాహనానికి ముందే సమాచారం ఇచ్చి ఉండాలి. ఈడీడీ (ఎక్స్‌పెక్టెడ్‌ డేట్‌ ఆఫ్‌ డెలివరీ) తెలుసుకుని ప్రసవానికి ఐదు రోజుల ముందు ఆస్పత్రిలో చేర్చాలి.  సాధారణంగా ప్రసవ సమయానికి 10 ఎంజీ కన్నా ఎక్కువగా హిమోగ్లోబిన్‌ ఉండాలి. 6 ఎంజీ లోపల ఉంటే తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. 8 నుంచి 10 ఎంజీ మధ్యలో ఉంటే ఐరన్‌ సిప్రోజ్‌ ఇంజెక్షన్లు (మూడు నుంచి నాలుగు) వేయించేలా చూడడంతో పాటు ఐరన్‌ ఫోలిక్‌ మాత్రలు ఉదయం, రాత్రి వేసుకునేలా చేయాలి. కానీ సువర్ణ విషయంలో అడుగడుగునా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కన్పిస్తోంది. ఈమెకు ప్రసవం చేసే సమయానికి 5 ఎంజీ మాత్రమే హిమోగ్లోబిన్‌ ఉన్నట్లు సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ వెల్లడించారు. దీన్ని బట్టి ‘బర్త్‌ప్లాన్‌’ ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కాగా.. సువర్ణ మతి విషయం తెలియగానే సూపరింటెండెండ్‌తో పాటు ఆర్‌ఎంఓ వైవీ రావు  కాన్పుల వార్డుకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నిద్రమత్తులో వైద్య, ఆరోగ్యశాఖ
జిల్లాలో ఒక బోధనాస్పత్రి, ఒక జిల్లా ఆస్పత్రి, 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో గర్భిణులకు మెరుగైన‡ సేవలు అందడం లేదు. సబ్‌ సెంటర్లలో కూడా గర్భిణుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపుతున్నారు. పట్టణాలు, నగరాల్లోనే∙ఏఎన్‌ఎంల పనితీరు ఘోరంగా మారింది. గర్భిణులకు నెలవారీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సూచనలు అందించాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో సక్రమంగా చేయడం లేదు. ఈ క్రమంలో ప్రసూతి మరణాలు కొనసాగుతున్నాయి.

ఏడాది         ప్రసూతి మరణాలు        
2011–12        51                    
2012–13        58                
2013–14        58                    
2014–15        85                
2015–16         71                    
2016–17        35                    
(సెప్టెంబర్‌ వరకు)     
మొత్తం        358               

మరిన్ని వార్తలు