మేయర్‌ హత్య కేసులో సాక్షి హత్యకు కుట్ర

3 Mar, 2017 22:31 IST|Sakshi

సతీష్‌ను టార్గెట్‌ చేసినట్లు పోలీసుల గుర్తింపు
న్యాయవాదుల బేరాలు.. రూ.5 లక్షల సుపారి?
కేసు నమోదుపై ఖాకీల దృష్టి


చిత్తూరు (అర్బన్‌): చిత్తూరు మేయర్‌ అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్‌ హత్య కేసులో ప్రధాన సాక్షిని మట్టుబెట్టడానికి నిందితులు కుట్ర పన్నినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగా బేరానికి ఓ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో మరో వ్యక్తి కొన్ని రోజులు రెక్కీ నిర్వహించినట్లు పేర్కొంటున్నారు. ఈ విషయంపై నిందితులపై కేసు నమోదు చేయడానికి దృష్టి సారించినట్టు సమాచారం. 2015 నవంబరు 17న చిత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయంలోకి వచ్చిన దుండగులు మేయర్‌ అనూరాధ, ఆమె భర్త కటారి మోహన్‌ను హత్య చేశారు.  ఇందులో చింటూ సహా 22 మంది నిందితులు ఉన్నారు. హత్య జరిగిన సమయంలో దుండగుల్ని అడ్డుకున్న కొంగారెడ్డిపల్లెకు చెందిన సతీష్‌ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. అతను తృటిలో తప్పించుకున్నాడు. ఈ కేసులో ఏకైక ప్రత్యక్ష సాక్షి ఇతనే. అతన్ని మట్టుబెడితే కేసులో సాక్ష్యం చెప్పే వారు ఎవరూ ఉండరని నిందితులు భావించారని, దీంతో సతీష్‌ను హత్య చేయడానికి ప్లాన్‌ చేసినట్లు పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. గత ఏడాది బంగారుపాళ్యంలో దారి దోపిడీలు చేస్తూ పట్టుబడ్డ రాజేష్, మురళి అనే వ్యక్తులు పీడీ యాక్టు కింద కడప సెంట్రల్‌ జైలు ఉన్నారు.

సతీష్‌ను చంపడానికి కొందరు వీరిని సంప్రదించగా తాము చిన్నపాటి దోపిడీలు చేసుకుంటున్నామని, హత్యలు చేయలేమని చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కొందరు తవణంపల్లెకు చెందిన బత్తల రామచంద్రను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఓ హత్య కేసులో కడప జైలులో శిక్ష అనుభవిస్తూ పారిపోయిన బత్తల రామచంద్రను కాణిపాకం పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సమయంలో సతీష్‌ను చంపడానికి రామచంద్ర రెక్కీ నిర్వహించాడని, ఇతనితో ఇద్దరు న్యాయవాదులు బేరసారాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి పూతలపట్టుకు చెందిన ఓ టీడీపీ కార్యకర్త సుపారీగా రూ.5 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసే విషయమై సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు