నగరపాలక పంచాయతీ

11 Apr, 2017 00:04 IST|Sakshi
  • ముదిరిపాకాన పడిన కమిషనర్, మేయర్‌ విభేదాలు
  • గుంటూరు నుంచి వచ్చిన మున్సిపల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లు 
  • కార్యదర్శి కార్యాలయంలో రికార్డుల పరిశీలన 
  • నకళ్లు వెంటబెట్టుకు వెళ్లిన వైనం 
  • వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ ఫిర్యాదుతో కదిలిన రాష్ట్ర యంత్రాంగం
  • పాలన గాడితప్పడంతోనే  ప్రభుత్వం దృష్టికి..
  • సాక్షి, రాజమహేంద్రవరం : 
    రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో మేయర్‌ పంతం రజనీశేషసా యి, కమిషనర్‌ వి.విజయరామరాజుల మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు పరచడంలో ఒకరి కొకరు పంతాలకు పోవడంతో కౌన్సిల్, స్టాండింగ్‌ కమిటీ తీర్మానాలు కొన్ని పెండిం గ్‌లో పడిపోతున్నాయి. నగరపాలన కుంటుపడుతుండడంతో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్యమంత్రికి, మున్సి పల్‌ పరిపాలన సంచాలకులకు ఫిర్యా దు చేశారు. దీంతో సోమవారం మున్సిపల్‌ సంచాలకులు కన్నబాబు ఆదేశాల మేరకు గుంటూరు నుంచి సహాయ సంచాలకులు టీఎస్‌ఎస్‌ఎ¯ŒSజీ శ్రీనివాస్, పి.రాఘునాథ్‌రెడ్డిలు రాజమహేంద్రవరం వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరపాలక సంస్థ కార్యదర్శి శైలజావల్లి కార్యాలయంలో కౌన్సిల్, స్థాయీ సంఘం తీర్మానాలు, ఇతర రికార్డులు పరిశీలించారు. వాటి నకళ్లను తమ వెంటబెట్టుకు వెళ్లారు. తాము గమనించిన విషయాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని సహాయ సంచాలకులు శ్రీనివాస్, రాఘునాథ్‌రెడ్డి తెలిపారు. 
    అంత్య పుష్కరాల నుంచి విభేదాలు మొదలు 
    తనకు తెలియకుండానే స్టాండింగ్‌ కమిటీ , కౌన్సిల్‌ సమావేశం అజెండాలోకి అంశాలు చేర్చుతున్నారంటూ గతంలో మేయర్‌ పంతం రజనీశేషసాయి విలేకర్ల సమావేశంలో కుండబద్ధలు కొట్టిన విషయం తెలిసిందే. నగరపాలక సంస్థలో తనకు తెలియకుండానే పాలన జరిగిపోతోందని, ఇలా అయితే ఇక పాలక మండలి, మేయర్‌ ఎందుకని ఘాటుగా స్పందించారు. అధికార యంత్రాంగమే పాలన చేసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. అదే సమయంలో తన పరిధి మేరకే తాను పని చేస్తున్నానని, తనకు ఉన్న అధికారం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నానని కమిషనర్‌ వి.విజయ రామరాజు పేర్కొన్నారు. మేయర్, కమిషనర్ల మధ్య గోదావరి అంత్య పుష్కరాల నుంచి పాలన, నిర్ణయాలలో ప్రారంభమైన మనస్పర్థలు ‘హ్యాపీ సండే’ కార్యక్రమంతో మరింత ముదిరాయి. ‘తనకు తెలియకుండానే కౌన్సిల్, స్థాయీ సంఘం సమావేశం అజెండాలోకి అంశాలు చేర్చుతుండడంతో వాటిని తోసిపుచ్చుతున్నారు. వాటిని తరువాత సమావేశంలో అనుమతి కోసం యంత్రాంగం చేర్చుతోంది. నగరపాలక సంస్థలో ఇతర కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికిలాగే వాచ్‌మెన్ల జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని మేయర్‌ రజనీశేష సాయి కమిషనర్‌కు లేఖ రాశారు. అయితే ఆ విషయం బుట్టదాఖలైంది. దీంతో ఇరువురి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాలక మండలి నిర్ణయం లేకుండానే మున్సిపల్‌ పాఠశాలలోని స్వీపర్లకు జీతాలు పెంచి ఇస్తున్నారని, అలాంటప్పుడు ఇక కౌన్సిల్‌ ఆమోదం ఎందుకని డిసెంబర్‌లో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌ ప్రశ్నించారు. 
    కంప్యూటర్‌ ఆపరేటర్ల జీతాలతో మరోసారి... 
    ఇక తన వ్యక్తిగత కంప్యూటర్‌ ఆపరేటర్‌ విషయంలో మేయర్‌కు కమిషనర్‌కు మధ్య ఉన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించకపోవడంతో మేయర్‌ కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్న ఆపరేటర్ల జీతాలు విడుదల తీర్మానాన్ని పక్కనబెట్టారు. దీనిపై ఈ నెల ఏడో తేదీన జరిగిన బడ్జెట్‌ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. జీతాలు ఆపవద్దని నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో వారు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.
    వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుతో కదిలిన రాష్ట్ర యంత్రాంగం...
    గత కొన్ని నెలలుగా నగరపాలక సంస్థలో జరుగుతున్న విషయాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు విలేకర్ల సమావేశం నిర్వహిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పాలక మండలి తీరును ఎండగట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత మేడపాటి షర్మిలారెడ్డి నగరపాలక సంస్థలో జరుగుతున్న విషయాలను ముఖ్య మంత్రి చంద్రబాబుకు, మున్సిపల్‌ పరిపాలన సంచా లకులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు నుంచి వచ్చిన మున్సిపల్‌ పరిపాలన సహాయ సంచాలకులు సోమవారం నగరపాలక సంస్థలో రికార్డులు పరిశీలించి, నకళ్లు తమవెంటబెట్టుకు వెళ్లారు.
     
>
మరిన్ని వార్తలు