మయూర వాహనాధీశా.. నమో నమః

20 Feb, 2017 22:16 IST|Sakshi
మయూర వాహనాధీశా.. నమో నమః
- నేటి రాత్రి వరకే మల్లన్న స్పర్శ దర్శనం
- రేపటి నుంచి అందరికీ అలంకార దర్శనమే
- రాష్ట్ర ప్రభుత్వం తరపున
  నేడు పట్టువస్త్రాల సమర్పణ
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు 
 
శ్రీశైలం: శ్రీశైలేశుడు భ్రామరీ సమేతంగా మయూర వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. స్వామి, అమ్మవార్ల దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు హరోంహర.. శంభోశంకర.. శ్రీశైల మల్లన్నా పాహిమాం.. పాహిమాం అంటూ పురవీధుల్లో సాగిలపడ్డారు. సోమవారం రాత్రి 8 గంటలకు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను మయూర వాహనంపై అధిష్టింపజేశారు. వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేద పండితులు వాహన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వాహన సమేతులైన స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగిస్తూ కృష్ణదేవరాయల గోపురం మీదుగా రథశాల వద్దకు చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నంది మండపం, బయలు వీరభద్రస్వామి మండపం చేరుకొని తిరిగి రాత్రి 9.30 గంటలకు ఆలయ ప్రాంగణం చేరుకుంది. గ్రామోత్సవంలో లక్షలాది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాజనాలర్పించారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ భరత్‌గుప్త, ఈఈలు శ్రీనివాస్‌, రామిరెడ్డి, శ్రీశైలప్రభ ఎడిటర్‌ డాక్టర్‌ కడప అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 
నేటి రాత్రి వరకే మల్లన్న స్పర్శదర్శనం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా మంగళవారం రాత్రి వరకే మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త  తెలిపారు. ఆ తర్వాత మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు మల్లికార్జునస్వామివార్ల ఆలంకార దర్శనాన్ని మాత్రమే కల్పిస్తామన్నారు.   శివస్వాములు, సాధారణ భక్తజనంతో పాటు వీఐపీలు, వీవీఐపీలకు కూడా మల్లన్న స్పర్శదర్శనం శివరాత్రి ముగిసే వరకు ఉండదన్నారు. శివరాత్రి పర్వదినాన నిర్వహించే స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రోడ్లు భవనాలు, రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మంగళవారం సాయంత్రం పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు.
 
మరిన్ని వార్తలు