కలి‘విడి’గా జిల్లాలు

23 Aug, 2016 21:46 IST|Sakshi
కలి‘విడి’గా జిల్లాలు
 • నిన్నటి వరకు కలిసుండి.. నేడు విడివడి..
 • జిల్లాల మధ్య కొత్త ‘సరిహద్దు’లు
 • మూడు జిల్లాల భౌగోళిక స్వరూపం తీరు
 • సిద్దిపేట సరిహద్దుగా ఐదు జిల్లాలు
 • సంగారెడ్డి హద్దున 2 రాష్ట్రాలు, 3 జిల్లాలు  
 • మెదక్‌ చుట్టూ మూడు జిల్లాలు..
 • కూతవేటు దూరంలోనే ‘కొత్త జిల్లాలు’
 • సాక్షి, సంగారెడ్డి: జిల్లాల పునర్విభజనతో మెదక్‌ జిల్లా భౌగోళిక స్వరూపం పూర్తిగా మారనుంది. ఒక్కటిగా ఉన్న మెదక్‌ జిల్లా పునర్విభజనతో మూడు జిల్లాలుగా ఏర్పడనుంది. మెదక్‌ జిల్లా.. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా ఏర్పడనున్న విషయం తెలిసిందే. దీంతో నిన్నటి వరకు ఒక్కటిగా ఉన్న మండలాలు సైతం ఇప్పుడు సరిహద్దులుగా మారనున్నాయి.

  ప్రభుత్వం ప్రకటించిన జిల్లాల పునర్విభజన ముసాయిదాను అనుసరించి మెదక్‌ జిల్లాలోని 46 మండలాలను విభజించి మూడు జిల్లాలుగా చేయనున్నారు. 23 మండలాలతో సంగారెడ్డి అతిపెద్ద జిల్లాగా ఏర్పాటు కానుంది. ప్రతిపాదిత సంగారెడ్డి జిల్లాలో 23 మండలాలు,  612 గ్రామాలు ఉండనున్నాయి.

  సంగారెడ్డి జిల్లా విస్తీర్ణం 4490.05 కి.మీటర్లు ఉండనుండగా జనాభా 15,49,277 ఉండనున్నారు. సంగారెడ్డికి రెండు రాష్ట్రాలు, మూడు జిల్లాలు సరిహద్దుగా మారనున్నాయి. సంగారెడ్డి జిల్లాకు జహీరాబాద్‌ వైపు కర్ణాటక, నారాయణఖేడ్‌ వైపు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుగా ఉంటాయి. అలాగే కొత్త జిల్లా మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలు సరిహద్దుగా మారనున్నాయి.

  సిద్దిపేటకు ఐదు జిల్లాల సరిహద్దులు
  ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఐదు జిల్లాలు సరిహద్దు జిల్లాలుగా మారనున్నాయి. 19 మండలాలు, 405 గ్రామాలు 3825.29 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో నూతనంగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు కానుంది. 5,30,639 జనాభా కొత్త జిల్లాలో ఉండనుంది. సిద్దిపేటకు మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు సరిహద్దు జిల్లాలుగా మారనున్నాయి.

  ఐదు జిల్లాల పరిధిలోని సరిహద్దు గ్రామాలతో సిద్దిపేట జిల్లా బౌగోళిక విస్తీర్ణం రూపకల్పన జరిగింది. నిన్నటి వరకు మెదక్‌తో కలిసి ఉన్న మండలాలు సిద్దిపేటకు సరిహద్దు ప్రాంతాలుగా మారనున్నాయి. మెదక్‌లోని తూప్రాన్, చేగుంట, రామాయంపేట సరిహద్దు మండలాలుగా మారతాయి.

  కూతవేటు దూరంలో..
  సిద్దిపేట జిల్లా సరిహద్దులోని ఇల్లంతకుంట మండల పరిధిలోని సరిహద్దు గ్రామం పొత్తూరు నుంచి కిలోమీటర్‌ దూరం దాటితే కరీంనగర్‌ జిల్లా వస్తుంది. హుస్నాబాద్‌ మండలంలోని చివరి గ్రామం జిల్లెల్లగడ్డ నుంచి మూడు కిలోమీటర్లు దాటితే హన్మకొండ జిల్లా ప్రారంభం అవుతుంది. 

  ములుగు మండలం వంటిమామిడి నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే రంగారెడ్డి జిల్లా తుర్కపల్లి ప్రారంభం అవుతుంది. ముస్తాబాద్‌ మండలంలోని చిప్పలపల్లి నుంచి నాలుగు కిలోమీటర్లు దాటితే నిజామాబాద్‌ ప్రారంభం అవుతుంది. అలాగే జగదేవ్‌పూర్‌ మండలం ధర్మారం సరిహద్దు గ్రామం నుంచి కిలోమీటర్‌ వెళ్తే నల్లగొండ జిల్లా తగలనుంది.  

  మెదక్‌కు రెండు వైపులా కొత్త జిల్లాలు
  ప్రతిపాదిత మెదక్‌ జిల్లాకు రెండు వైపులా కొత్త జిల్లాలు సరిహద్దు జిల్లాలుగా మారనున్నాయి. మెదక్‌ జిల్లా 14 మండలాలు, 366 గ్రామాలతో 2695.18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త జిల్లాగా ఏర్పాట కానుంది. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు మెదక్‌కు సరిహద్దు జిల్లాలుగా మారనున్నాయి. నిన్నటి వరకు ఒకే ప్రాంతంగా ఉన్న మెదక్‌ ప్రస్తుతం మూడు జిల్లాలుగా మారనుండటంతో ఈ పరిస్థితి నెలకొంది.

  మెదక్‌ జిల్లాకు నిజామాబాద్‌ సరిహద్దు జిల్లాగా యథాతథంగా కొనసాగనుంది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి గుమ్మడిదల, నర్సాపూర్, అందోలు, రాయికోడ్, మనూరు, నారాయణఖేడ్, కల్హేర్‌ మండలాలు సరిహద్దు మండలాలుగా ఉండనున్నాయి. ఇక సిద్దిపేట వైపు వర్గల్, దౌల్తాబాద్, మిర్‌దొడ్డి, దుబ్బాకలు సరిహద్దు మండలాలుగా మారనున్నాయి.

  మెదక్‌ జిల్లా సరిహద్దు గ్రామాలు
  1. బోధన్‌ రహదారిలో పోచమ్మరాల్‌ చివరి గ్రామం
  2. కామారెడ్డివైపు రామాయంపేట మండలం దామరచెరువు ఆఖరి గ్రామం.
  3. సిద్దిపేట వైపు ఆఖరి గ్రామం రామాయంపేట మండలం నిజాంపేట.
  4. గజ్వేల్‌వైపు ఆఖరి గ్రామం తూప్రాన్‌ మండలం ఏలూరు నాచారం.
  5. మేడ్చల్‌ వైపు చివరి గ్రామం తూప్రాన్‌ మండలం కాళ్లకల్‌.
  6. నర్సాపూర్‌ రూట్లో  కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేట.
  7. సంగారెడ్డి వైపు ఆఖరి గ్రామం కౌడిపల్లి మండలం చిట్కుల్‌

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా