రాష్ట్రాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం

16 Sep, 2016 23:47 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌


తిరుపతి కల్చరల్‌ : మీడియా చాలా శక్తివంతమైందని, రాష్ట్ర వికాసానికి తన శక్తిని వినియోగించాలని  రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ కోరారు. ఓ ప్రైవేటు హోటల్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్ట్స్‌ ఫోరం చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్దిలో మీడియా పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు.  ఏపీజేఎఫ్‌ జర్నలిస్టుల సంక్షేమం కోసమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి ప్రజలను చైతన్యవంతులు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా ఏ జర్నలిస్టు సంఘం  పని చేయని విధంగా రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు.  ఇందులో భాగంగా ఏపీజేఎఫ్‌ ఏదో  ఒక గ్రామాన్ని  దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్ర విభజన  అన్యాయంగా, అసంబంద్ధంగా జరిగిందన్నారు. తెలంగాణకు ఆస్తులు, అంధ్రకు అప్పులు ఇచ్చారని, రాష్ట్ర విభజన నాటికి 16 వేల కోట్లు లోటు బడ్జెట్‌ను మిగిల్చారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం అంచనాల ప్రకారం 2020 నాటికి కూడా రూ. 2500 కోట్లు లోటు బడ్జెట్‌లోనే మన రాష్ట్రం ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో పాలనాదక్షుడైన చంద్రబాబు సీఎం కావడంతో విభజన జరిగిన ఆరు నెలల్లోనే విభజన సమస్యలను మరిచిపోగలిగామన్నారు. 2050 నాటికి భావితరాలు గర్వించేలా  గొప్ప రాష్ట్రం రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మీడియా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలని చెప్పారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో  మీడియా కీలపాత్ర పోషిస్తోందన్నారు. ఏపీజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  ఎ.గిరిధర్, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కృపవరం, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మోహన్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.
––––––––––

 

మరిన్ని వార్తలు