మళ్లీ మొదటికి!?

22 Oct, 2016 23:27 IST|Sakshi
మళ్లీ మొదటికి!?

– గ్రామాల్లో నిలిచిన మీ–సేవ కేంద్రాల ప్రక్రియ
– రద్దు దిశగా 158 కేంద్రాల ఏర్పాటు నోటిఫికేషన్‌


అనంతపురం అర్బన్‌ : గ్రామాల్లో కొత్తగా మీ–సేవ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్‌ పడింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేసి మరోమారు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు అధికార యంత్రాగం సిద్ధమవుతోంది. అనుమతి కోసం హైదరాబాద్‌లోని సంస్థ అధికారుల దష్టికి ఇక్కడి అధికారులు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. దీంతో ఏర్పాటు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. నిబంధనల మేరకు దరఖాస్తులు పూర్తి చేయని కారణంగానే నోటిఫికేషన్‌ రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పుకొస్తున్నారు.

158 కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌
    జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 158 గ్రామాలను గుర్తించడంతో పాటు దరఖాస్తు చేసుకోవాలంటూ నోటిఫికేషన్‌ని మూడు నెలల క్రితం జారీ చేశారు. అయితే 158 గ్రామాలకు 82 గ్రామాల్లో మీ–సేవ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 244 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక సమాచారం. మిగతా 76 గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు రాలేదని సమాచారం.

244లో కేవలం రెండింటికే అర్హత
    మీ–సేవ ఏర్పాటు చేసేందుకు 82 గ్రామాల్లో నుంచి వచ్చిన 244 దరఖాస్తుల్లో కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే నిబంధనల ప్రకారం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుతో పాటు పదో తరగతి పాస్‌ సర్టిఫికెట్, కంప్యూటర్‌ కోర్సు చేసినట్లు సర్టిఫికెట్, ఆధార్‌ కార్డు తప్పని సరిగా జత చేయాలనే నిబంధన ఉందని అధికారులు తెలిపారు. ఈ నిబంధనలను ప్రకారం రెండు దరఖాస్తులు మాత్రమే అర్హత సాధించాయని తెలిపారు. మిగతా 242 దరఖాస్తులు నిబంధనల మేరకు లేకపోవడం పక్కకు పెట్టినట్లు తెలిసింది.

మళ్లీ నోటిఫికేషన్‌ దిశగా...
    మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేసి మరో దఫా నోటిఫికేషన్‌ ఇచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు రాష్ట్ర స్థాయి నుంచి అనుమతి తప్పని సరి అన్నారు. దీంతో విషయాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల దష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ మరోమారు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చిన వెంటనే, 158 కేంద్రాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వారు తెలిపారు.    మీ–సేవ కేంద్రాల ఏర్పాటుకు మారోమారు నోటిఫికేషన్‌ జారీ చే స్తే గతంలో చేసుకున్న దరఖాస్తులు చెల్లవని అధికారులు తెలిపారు. నవంబరు ఒకటి తరువాత నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందని, అప్పుడు అందరూ కొత్తగా మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు