ఆధార్‌కు 'వంద'నం

25 Apr, 2017 18:34 IST|Sakshi
ఆధార్‌కు 'వంద'నం

► మీ సేవ, ఆధార్‌ నమోదు కేంద్రాల్లో అడ్డగోలుగా వసూళ్లు
► సేవ ఏ రకమైనా రూ.వంద నుంచి రూ.200 దండుకోవడమే
► సామాన్యుల జేబులకు చిల్లు
►  ప్రభుత్వ చార్జీల అమలు ఊసెత్తని ప్రైవేటు ఫ్రాంచైజీలు
► ఎక్కడా కనిపించని సిటిజన్‌ చార్టర్‌
► అధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు శూన్యం


మీ సేవ, శాశ్వత ఆధార్‌ నమోదు (పీఈసీ) కేంద్రాలు నిలువు దోపిడీకి చిరునామాగా మారాయి. ఏదైనా సేవ కావాలని సామాన్యుడు ఆ కేంద్రాల గడప తొక్కితే.. ఇక డబ్బులుపిండుకోవడమే ప్రైవేటు ఫ్రాంచైజీల వంతైపోయింది. హీనపక్షం రూ.వంద నుంచి రూ. రెండు వందల దాకా ముట్టజెప్పందే ఏ పనీ కావడం లేదు. కొన్ని రోజులుగా జిల్లాలో యథేచ్ఛగా దోపిడీ సాగుతున్నా.. అధికారులు మాత్రం తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు.. ఎవరైనా సమాచారం ఇచ్చినా దానిని పెడచెవిన పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా:
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాలకు  ఆధార్‌ తప్పనిసరి. ఐదేళ్లలోపు చిన్నారులకూ ఆధార్‌ నంబర్‌ ఉండాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. అంగన్‌వాడీలో చిన్నారుల నమోదు నుంచి మొదలుకొని బ్యాంకింగ్‌ సేవలు, వాహనాల కొనుగోళ్ల వరకు అన్నీ ఆధార్‌తోనే ముడిపడి ఉన్నాయి. ఇటువంటి వారందరికీ ఆధార్‌ సేవలు అందించేందుకు జిల్లాలో శాశ్వత ఆధార్‌ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను ప్రైవేటు మీ సేవ కేంద్రాల్లోనే నెలకొల్పారు. జిల్లాలో ఇలా దాదాపు 30 ఆధార్‌ నమోదు కేంద్రాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఆధార్‌ నమో దు చేసుకునే వారి నుంచి ఒక్క పైసా కూడా ఫ్రాంచైజీలు తీసుకోకూడదు. ఉచితంగానే వివరాలు నమోదు చేయా లి. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టం చేసినా ఫ్రాంచైజీలు మాత్రం పట్టించుకోవ డం లేదు. కొత్తగా వివరాల నమోదుకు రూ.100 నుంచి రూ.150 దాకా ప్రజల నుంచి వసూలు చేస్తుండడం గమనార్హం. ఉచితమని సామాన్యులకు తెలియకపోవడంతో అందినకాడికి దండుకుంటున్నారు. వేలిముద్రల అప్‌డేట్, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్‌ నంబర్, ఈ–మెయిల్‌ ఐడీ తదితర వాటిని అప్‌డేట్‌ చేస్తే రూ. 25 డబ్బులు తీసుకోవాలి. కానీ ఈ చార్జీలు ఎక్కడా అమలు కావడం లేదు. అన్నింటికీ రూ. వంద ఇస్తేనే.. ఆధార్‌ సేవలు అందుతున్నాయి.

బాదుడే సేవ
నిబంధలనకు విరుద్ధంగా చార్జీ వసూలు చేయడంలోనూ మీ–సేవ కేంద్రాలు ఏమాత్రం తీసిపోవడం లేదు. పలు రకాల ప్రభుత్వ సేవలను ప్రజలకు సలువుగా, వేగవంతంగా అందించేందుకు మీ–సేవకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 30కిపైగా ప్రభుత్వ శాఖల పరిధిలోని సుమారు 320 రకాల సేవలు ఈ కేంద్రాల ద్వారా ప్రజలు పొందుతున్నారు. జిల్లాలో 302 మీ సేవ కేంద్రాలు ఉండగా.. వీటిలో 8 నేరుగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. మిగిలిన 294 ప్రైవేటు ఫ్రాంచైజీల చేతుల్లో ఉన్నాయి. జిల్లాలో నిత్యం సగటున తొమ్మిది వేల మంది ప్రజలు మీసేవ కేంద్రాల ద్వారా సేవలు పొందుతున్నారు. అత్యధికంగా రెవె న్యూ, వ్యవసాయ శాఖల పరిధిలో వినియోగించుకుంటున్నట్లు అధికారుల అంచనా. ఇంతవరకు బాగానే ఉన్నా.. సర్వీస్‌ చార్జీతోపాటు అదనంగా ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు పిండుకుంటున్నారు. సేవ రకాన్ని బట్టి.. అదనంగా రూ. 50కి పైగా వసూలు చేస్తున్నారు. ఇంకొన్ని ఫ్రాంచైజీలు రూ.వంద వరకు దండుకుంటున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం మొదలు అన్ని రకాల సేవలపై బాదుడు తప్పడం లేదు. చివరకు రేషన్‌కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నా రూ.వంద తీసుకుంటున్నారు. సేవా రుసుం, చట్టపరమైన చెల్లింపులకు మించి ఒక్కపైసా కూడా అదనంగా ఆశించకూడదు. కానీ, ఇది ఏ కేంద్రంలోనూ జరగడం లేదన్నది బహిరంగ సత్యం. నిబంధనల ప్రకారం ప్రతి కేం ద్రంలో పౌర సేవల వివరాలు, చార్జీలను తెలిపే చార్ట్‌ ఉండాలి. ఇది ఏ కేంద్రంలోనూ కనిపించకపోవడం గమనార్హం. పైగా అదనంగా డబ్బులు తీసుకున్న మేరకు.. బిల్లులు ఇస్తారా అంటే అదీ లేదు. ఇలా అడుగడుగునా నిబంధనల అతిక్రమణ జరుగుతున్నా అధికారులు దృష్టి సారించిన దాఖలాలు శూన్యం. దీంతో ప్రైవేటు ఫ్రాంచైజీలు చెప్పిందే చార్జీగా మారింది.

యాజర్‌ చార్జీ పెంచినా..
మీసేవ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం యూజర్‌ చార్జీలను పెంచింది. ప్రతి సేవపై అదనంగా రూ.10 పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఈ చార్జీలు ఈ నెల ఏడో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఆయా సేవల రకాన్ని బట్టి తమకు ఇస్తున్న కమీషన్‌ ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని ప్రైవేటు ఫ్రాంచేజీలు పలుమార్లు ప్రభుత్వానికి విన్నమించాయి. దుకాణాల అద్దె, విద్యుత్‌ చార్జీలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే తమకు కేంద్రాల నిర్వహణ గుదిబండగా మారిందని వివరించారు. ఈ నేపథ్యంలో యూజర్‌ చార్జీలను ప్రభుత్వం పెంచినా.. ప్రజలనుంచి అడ్డగోలు వసూలు తీరు మాత్రం మారలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై వివరణ కోసం జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్‌కు ‘సాక్షి’ ఫోన్‌ చేయగా.. ఆయన నుంచి స్పందన కరువైంది.

మరిన్ని వార్తలు