ఇది తగునా?

22 Aug, 2017 03:20 IST|Sakshi
ఇది తగునా?

టీడీపీ నేత హరిప్రసాద్‌ కార్యాలయంలో నిర్వాసితుల సమావేశం
ఆర్డీఓతోపాటు అధికారులు వెళ్లడంపై విమర్శలు
ప్రభుత్వ కార్యాలయాలున్నా..నేతల వద్దకు అధికారులు
ఎందుకు ఇలా వెళ్తున్నారో అర్థంకాని వైనం
సాకు ఏదైనా..వెళ్లడంపైనే చర్చ


అధికారులపై ప్రతిసారి విమర్శలు వస్తున్నాయ్‌.. కొంతమందికి పార్టీపై అభిమానమో లేక నాయకుల మెప్పు కోసమో తెలియదు కాని వారి తీరులో మార్పు కనిపించడం లేదు. నిజంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమైతే ప్రభుత్వ కార్యాలయాల్లో చర్చించవచ్చు. సాకు ఏదైనా అధికారపార్టీ నేతల ఇళ్ల వద్దకు అధికారులే నేరుగా వెళ్లడం జిల్లాలో ఎక్కువైపోయింది. వారి తీరుపై విమర్శలు వస్తున్నా వారు మాత్రం మారడం లేదు.

సాక్షి కడప: నెలక్రితం కీలక పోలీసు అధికారులందరూ కమలాపురం టీడీపీ నేత ఇచ్చిన విందుకు హాజరై విమర్శల పాలైన విషయం మరువక మునుపే.. మరోమారు అధికారులు టీడీపీ నేత కార్యాలయానికి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడపలో పదే పదే కిందిస్థాయి అధికారులు ఇలాంటి వ్యవహారాలతో వివాదస్పదమవుతున్నా.. చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ప్రైవేటు కార్యాలయంలో జరిగే కార్యాక్రమానికి రాలేమని కూడా చెప్పకుండా ఎగేసుకుపోవడం వివాదంగా మారుతోంది.

ఇదేమీ తీరు సార్లు
జిల్లాలో చాలాచోట్ల అధికారులు అధికారపార్టీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నారు. అటువంటిది టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్, మరో మైనారిటీ నేతతో కలిసి హరిటవర్స్‌లోని కార్యాలయంలో బుగ్గవంక నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. నేతలు నిర్వాసితులతో చర్చిస్తున్న సమయంలోనే కడప ఆర్డీఓ చినరాముడుతోపాటు రెవెన్యూ అధికారులు, పలువురు కార్పొరేషన్‌ అధికారులు అక్కడికి వెళ్లారు. అంతేకాకుండా అనేక అంశాలపై చర్చించారు. అసలు అధికారపార్టీ నేత ఆఫీసులో జరిగే సమావేశానికి ఎందుకు వెళ్లారో అధికారులకే ఎరుక. బుగ్గవంకకు సంబంధించి అయితే ఆర్డీఓ కార్యాలయానికి పిలిపించుకుని అయినా బాధితులతో మాట్లాడి ఉండవచ్చు. లేదా జిల్లాకేంద్రంలో ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఎక్కడో ఒకచోట సమావేశం కావచ్చు. కానీ అలా కాకుండా నేరుగా అధికారులంతా పరిగెత్తుకుంటూ పోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఏం జరుగుతోంది..!
చాలాచోట్ల నేతలే బాధితులతో సమావేశాలు పెడుతున్నారు. జిల్లాలో అనేకచోట్ల తమ్ముళ్లు ఇదే తరహ పద్ధతులు అవలంబిస్తున్నారు. ఏంచేసినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణిలో నేతలు ముందుకు వెళుతూ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్ని స్తున్నారు. అధికారులను సైతం తమకున్న పలుకుబడితో కార్యాలయాలకు రప్పిస్తున్నారు.

బుగ్గవంక బాధితులతో చర్చించేందుకే వెళ్లాం: ఆర్డీఓ
బుగ్గవంక బాధితులు అందరూ హరి టవర్స్‌ వద్దకు రావడంతో మేం నచ్చజెప్పేందుకు వెళ్లామని కడప ఆర్డీఓ చినరాముడు పేర్కొన్నారు. బుగ్గవంక బాధితుల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే పోవాల్సి వచ్చిందన్నారు. బుగ్గవంక బాధితులందరూ వచ్చి ఉన్నారు.. మేం కేవలం ఆక్రమణల తొలగింపు, పరిహారం విషయంపైనే చర్చించి, బాధితుల్లో భయం పోగొట్టి పూర్తి స్థాయిలో న్యాయం చేసేలా కృషిచేస్తామని చెప్పి వచ్చినట్లు ఆర్డీఓ తెలిపారు.

న్యాయం కోసం బాధితులు వచ్చారు: బుగ్గవంక ప్రహరీగోడ, రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం అని ఆర్డీఓ, కడప తహసీల్దార్‌ తెలపడంతో నాగరాజుపేట, అటు రవీంద్రనగర్‌కు చెందిన బాధితులు నావద్దకు వచ్చారు. ఈ విషయమై కడప ఆర్డీఓ, ఎమ్మార్వోలను చర్చించా. అందుకు వారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకంటా మని తెలిపారు. అయితే బాధితులు అనువైన చోట రెండు సెంట్ల స్థలంలో ఇంటిని నిర్మించి ఇవ్వడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వారి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌తో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. బాధితుల సమ స్య తీర్చేందుకు అన్నివిదాలా కృషిచేస్తాం.
– హరిప్రసాద్, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు