డెలివరీ బాయ్స్ బ్యాగులకే కన్నం వేశాడు

18 Aug, 2016 23:32 IST|Sakshi

తుర్కయంజాల్‌: ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డర్‌ చేస్తున్న ఓ యువకుడు వస్తువు డెలవరీ చేసేందుకు వస్తున్న ఆయా కంపెనీ ఉద్యోగుల బ్యాగ్‌లతో ఉడాయిస్తున్నాడు. సదరు కేటుగాడిని వనస్థలిపురం పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.  క్రైం సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, డీఐ సంజీవరెడ్డి కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని తణుకుకు చెందిన సురేష్‌ (26) వనస్థలిపురంలో నివాసముంటున్నాడు. ఇతగాడు మొదట ఆన్‌లైన్‌లో తప్పుడు చిరునామాతో వస్తువులు బుక్‌ చేస్తాడు. ఆర్డర్‌ చేసిన వస్తువులను ఆయా కంపెనీల ఉద్యోగులు డెలవరీ చేసేందుకు ఇతడు పేర్కొన్న అడ్రస్‌కు వస్తారు.

తాను ఇంటి పై అంతస్తులో ఉన్నానని పార్శిల్‌ తీసుకుని రావాలని ఆ ఉద్యోగికి చెప్తాడు. అతను తన బ్యాగును కింద బైకు మీద ఉంచి పైకి వెళ్తాడు. కిందే ఉన్న సురేష్‌ అతలోనే బైక్‌పై ఉన్న బ్యాగ్‌ ఎత్తుకుపోతాడు. ఈ విధంగా జూలై 27న నాగార్జునకాలనీలో, ఆగస్టు 8న కమలానగర్‌కాలనీలో నాప్‌టాల్, షాపింగ్‌జోన్‌ సంస్థల ఉద్యోగుల బ్యాగ్‌లు ఎత్తుకుపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సురేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే ఆ బ్యాగ్‌లు కాజేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.2 లక్షల 20 వేల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు