రమణమ్మే పిఠాపురం ఎంఈఓ

17 Sep, 2016 22:21 IST|Sakshi
రమణమ్మే పిఠాపురం ఎంఈఓ
  • సాక్షి ఎఫెక్‌
  • ఇద్దరు ఎంఈఓల పద్ధతికి చెక్‌ పెట్టిన విద్యాశాఖ
  • ఇన్‌చార్జి ఎంఈఓను తొలగిస్తూ ఆర్జేసీ ఆదేశాలు
  • రమణమ్మను రానివ్వమన్న ఎమ్మెల్యే వర్మకు భంగపాటు
  •  
    పిఠాపురం : 
    ఎక్కడా లేని విధంగా ఇద్దరు ఎంఈఓలను కొనసాగించిన పిఠాపురం మండల పరిషత్‌ అధికారులకు, ప్రజాప్రతినిధులకు చుక్కెదురయింది. రెగ్యులర్‌ ఎంఈఓగా  పనిచేసిన రమణమ్మనే కొనసాగించి, పూర్తి బాధ్యతలు అప్పగించాలని విద్యాశాఖ ఆర్జేసీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆమెతో పాటు కొనసాగుతున్న ఇన్‌చార్జి ఎంఈఓ గాజుల సుబ్రహ్మణ్యంను ఎంఈఓ బాధ్యతల నుంచి తొలగించినట్లు డీవైఈఓ నాగేశ్వరరావు తెలిపారు. కాగా ఎట్టిపరిస్థితుల్లోనూ రమణమ్మను ఆమెను ఇక్కడ జాయిన్‌ కానివ్వమని పట్టుదలకు పోయి ఇన్‌చార్జి ఎంఈఓతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వర్మకు ఇది భంగపాటేనని ఉపాద్యాయులు అంటున్నారు. పిఠాపురం ఎంఈఓగా పని చేస్తూ సెలవుపై వెళ్లిన రమణమ్మ సెలవు రద్దు చేసుకుని తిరిగి విధులకు రాగా ఆమెను చేర్చుకోవద్దంటూ ఎమ్మెల్యే వర్మ ఆదేశించడం అప్పట్లో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపింది. ఉపాధ్యాయసంఘాల నేతలు ఎమ్మెల్యేతో జరిపిన సంప్రదింపులు ఫలించకపోవడంతో మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో రమణమ్మ  తిరిగి జూలై 21న విధులకు హాజరు కావడానికి రాగా ఆమెను జాయిన్‌ చేసుకోడానికి ఎంపీడీఓ నిరాకరించారు. ఈ విషయం ‘సాక్షి’ దినపత్రికలో ‘పాపం ఎంఈఓ’ శీర్షికన ప్రచురితమైంది. దానికి స్పందిం చిన  జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆమెను ఎంపీడీఓ జాయిన్‌ చేసుకున్నారు. అయినా ఎమ్మెల్యే సుముఖంగా లేకపోవడంతో బాద్యతలు అప్పగించకుండా ఇన్‌చార్జి ఎంఈఓగా విరవ హైస్కూలు హెచ్‌ఎం సుబ్రహ్మణ్యంని  నియమించి విధులు నిర్వహింపజేస్తున్నారు.  రమణమ్మ తనకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇన్‌చార్జిని తొలగించి, తననే కొనసాగించాలన్న ఆర్జేసీ ఉత్తర్వులతో శనివారం విధుల్లో చేరినట్టు రమణమ్మ తెలిపారు.  
     
    రమణమ్మకు పూర్తి బాధ్యతలు..
    రమణమ్మను ఎంఈఓగా కొనసాగించాలని ఆర్జేసీ ఉత్తర్వులు ఇచ్చారని ఎంపీడీఓ సుబ్బారావు తెలిపారు.  ఆర్జేసీఉత్తర్వుల మేరకు రమణమ్మకు పూర్తి బాధ్యతలు అప్పగించామని డీవైఈఓ నాగేశ్వరరావు తెలిపారు. 
     
మరిన్ని వార్తలు