‘కారుణ్యం’ కొందరిపైనే

1 Feb, 2017 23:38 IST|Sakshi
‘కారుణ్యం’ కొందరిపైనే
– ఏడాది తరువాత కారుణ్య నియామకాలు చేపట్టిన ఆర్టీసీ
– 52 శ్రామిక్‌ పోస్టులను భర్తీ చేసేందుకు సర్టిఫికెట్ల పరిశీలన
 కర్నూలు(రాజ్‌విహార్‌): ఆర్టీసీ అధికారుల వైఖరితో సంస్థలో పనిచేస్తూ చనిపోయిన కార్మికుల ఇళ్లలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కారుణ్య నియామకాల కింద మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ అవకాశం కోసం కర్నూలు రీజియన్‌లో వీరి సంఖ్య 150 మందికి పైగా  ఉండగా గత ఏడాది ఫిబ్రవరిలో చేపట్టిన కానిస్టేబుల్‌ (సెక్యూరిటీ విభాగం) నియామకాల్లో 35 మందికి పోస్టులు ఇచ్చారు. దీనికి వయస్సు నిబంధన పెట్టడంతో అనేక మంది వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం 120 మంది మిగిలి ఉన్నారు.
 
శ్రామిక్‌ (మెకానిక్‌ విభాగం) పోస్టుల్లో నియమించేందుకు పోస్టుల్లో తీసుకోవాలంటూ సంస్థ గత వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టరు నండూరి సాంబశివరావు జూలై మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపించి ఈ శ్రామిక్‌ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి అదేనెల 31వ తేదీలోపు మరోసారి దరఖాస్తులు స్వీకరించారు. ఆగస్టులోగా అభ్యర్థుల విద్యార్హత, కుల, నివాస తదితర సర్టిఫికెట్ల పరిశీలన చేసి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నా సెలక‌్షన్‌ కమిటీ ఎంపికలో జాప్యం జరిగింది. 
 
58 మంది హాజరు:
కారుణ్య నియామకాల కింద 52 శ్రామిక్‌ పోస్టుల భర్తీకి బుధవారం దరఖాస్తుల పరిశీలనకు 60 మందిని పిలవగా 58 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంకా 68 మంది మిగిలి ఉన్నారు. బుధవారం వచ్చిన అభ్యర్థుల విద్యార్హత, ఇరత సర్టిఫికెట్లను పరిశీలించారు. సాధారణంగా శ్రామిక్‌ పోస్టులకు 10వ తరగతి తరువాత ఐటీఐలో డిజిల్‌ మెకానిక్‌ చేసిన అభ్యర్థులతోనే గతంలో భర్తీ చేసేవారు. అయితే కారుణ్య నియామకాల కింద ఉద్యోగం కోరుతూ సంవత్సరాల తరబడి నిరీక్షిస్తున్న ఉద్యోగుల పిల్లలకు ఊరట కల్పించారు.
 
ఐటీఐ లేకపోయినా కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే చాలని సడలించారు. ఓసీ అభ్యర్థుల వయస్సు 22 నుంచి 35 సంవత్సరాలలోపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఇవ్వగా 40 ఏళ్లు నిబంధన ఉండగా మహిళలు, శారీరక వికలాంగులు అనర్హులు కావడంతో కాల్‌ లెటర్లు పంపలేదు. సర్టిఫికెట్ల పరిశీల కమిటీకి డిప్యూటీ చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌ గోపి చైర్మన్‌ కాగా సభ్యులుగా డీసీఎంఈ రమేష్‌ బాబు, డీసీటీఎం శ్రీనివాసులు, కో ఆర్డినేటర్‌గా పీఓ సర్దార్‌ హుసేన్‌ వ్యవహరించారు. 
మరిన్ని వార్తలు