మెరిసిన ఆలోచన.. విరిసిన సృజన

1 Dec, 2016 21:54 IST|Sakshi
మెరిసిన ఆలోచన.. విరిసిన సృజన
 ఏలూరు సిటీ : జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏలూరు కస్తూరిభా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి పీతల సుజాత వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు భవిష్యత్‌ శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. జెడ్పీ ఛైర్మన్‌ బాపిరాజు మాట్లాడుతూ విద్య కేవలం ఉద్యోగం కోసమే కాకుండా సమాజంలోని అనేక రంగాల్లో ఉన్నతస్థితికి చేరుకునేందుకు ఉపయోగపడతుందన్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ సైన్సు అభివృద్ధి చెందటం ద్వారా నేడు అనేక భయంకర వ్యాధుల నుంచి విముక్తి లభించిందన్నారు. డీఈవో మధుసూధనరావు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించటమే కారణమన్నారు. విద్యార్థులు తార్కిక విధానంలో ఆలోచిస్తూ, తమలోని సృజనాత్మకతను జోడించాలని కోరారు. నగర మేయర్‌ నూర్జహాన్, ఏఎంసీ చైర్మన్‌ కురెళ్ళ రాంప్రసాద్, కార్పొరేటర్‌ చోడే వెంకటరత్నం, వైజ్ఞానిక ప్రదర్శనల కన్వీనర్‌ డీవీ రమణ పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ’ప్రస్తుత సమాజంలో నగదు రహిత చెల్లింపుల పాత్ర’  అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు.  విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
న్యూటన్‌ గమన నియమం
న్యూటన్‌ 3వ గమన నియమం వినియోగించి శక్తి సూత్రం ద్వారా యంత్రం ఎలా ముందుకు వెళుతుందో ప్రయోగం చేశాను. వ్యతిరేక దిశలో శక్తి వినియోగించినప్పుడు గమన నియమం వర్తిస్తుంది. శాస్త్రవేత్తలు ప్రయోగించే రాకెట్స్‌లోనూ ఇదే శక్తి సూత్రాన్ని పాటిస్తారు.
కేడీవీ ప్రసాద్‌ వర్మ, జెడ్పీహెచ్‌ఎస్, ఎన్‌ఆర్‌పీ అగ్రహారం
 
ఆయిల్‌ స్కిమ్మర్‌ యంత్రం 
ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్‌ను నౌకల్లో రవాణా చేస్తారు. కొన్నిసార్లు ఆయిల్‌ నౌకలు దెబ్బతిని సముద్రంలో ఆయిల్‌ పడిపోతుంది. దీంతో సముద్రజలాలు కాలుష్యమవుతున్నాయి. ఈ ఆయిల్‌ స్కిమ్మర్‌ యంత్రం ద్వారా  ఆయిల్‌ను వెలికితీయవచ్చు. కె.శివలలిత, జెడ్పీహెచ్‌ఎస్, దెందులూరు
రైల్‌ వైబ్రేషన్స్‌తో విద్యుత్‌ 
ప్రయాణిస్తోన్న రైలు వైబ్రేషన్స్‌ ద్వారా విద్యుత్‌ను తయారు చేసే అవకాశం ఉంది. రైలు పైన సిం«థటిక్‌ క్రిస్టల్స్‌తో పరికరాన్ని ఏర్పాటు చేయాలి. దానిపై ఒత్తిడి చేస్తూ, రైలు వైబ్రేషన్స్‌తో విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. ఈ విద్యుత్‌ను రైలు లోపల లైట్లు, ఫ్యాన్లకు వినియోగించుకోవచ్చు. 
ఎం.రవిశంకర్, ఎస్సీబీఎంహెచ్‌ఎస్, పాలకొల్లు
వ్యర్థ జలాల శుద్ధీకరణ  
వ్యర్థ జలాలను శుద్దిచేస్తే రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. వ్యర్థజలాలు సముద్రాల్లోకి వదిలివేయటం ద్వారా జలాలు కలుషితం అవుతున్నాయి. ప్రభుత్వాలు వ్యర్థనీటిని శుద్ది చేయాలి. తొమ్మిది దశల్లో శుద్ధి చేస్తే సాధారణ అవసరాలకు సమస్య ఉండదు. జి.గీతిక, శర్వాణీ పబ్లిక్‌ స్కూల్, ఏలూరు
కొల్లేరును కాపాడుకుందాం 
సహజసిద్ధ మంచినీటి సరస్సు కొల్లేరును భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అక్కడి ప్రకృతి సంపదను, మత్స్యసంపద, పక్షి సంపదను కాపాడుకోవాలి. రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజపద్ధతిలో చేపల వేట చేయాలి. కొల్లేరును మనం భద్రం చేసి ఉంచాలి. సీహెచ్‌ గాయత్రి, కస్తూరిభా స్కూల్, ఏలూరు
గోల్డెన్‌ రైస్‌ 
గోల్డెన్‌ రైస్‌ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయోటెక్నాలజీ అభివృద్ధి చెందిన దశలో మన రాష్ట్రంలోనూ తక్కువ ధరకే, తక్కువ నీటిని వినియోగించి గోల్డెన్‌ రైస్‌ను ఉత్పత్తి చేయవచ్చు. దీనిలో బీటా కెరోటిన్, బీ కెరోటిన్, విటమిన్స్‌ ఉన్నాయి. ఎస్‌.భాస్కర్‌ ప్రభాత్, సెయింట్‌ అలోషియస్, ఆకివీడు
 
>
మరిన్ని వార్తలు